గుంటూరు, నవంబర్ 23,
ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వాన్ని పరీక్షించుకోవచ్చు. ఆ సమయం.. సందర్భం నేతలకు చిక్కుతుంది. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సయితం తన నాయకత్వాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. గడచిన పది నెలల లోకేష్ వేరు. మూడు నెలల లోకేష్ వేరు అని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమితో పాటు నేతల నైరాశ్యం కూడా లోకేష్ ను ఆలోచనలో పడేశాయి.తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నా లోకేష్ నేరుగా రాజకీయాలు చేసిన సందర్భాలు లేవు. 2014 ముందు వరకూ ఆయన వెనక ఉండి నడిపించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన లోకేష్ కు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన తక్కువేనని చెప్పాలి. ఆయన పార్టీ ముఖ్యనేతలు, ఆయన సన్నిహితులు అందించే సమాచారం తప్ప ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. దీంతో ఆయన హైఫై నేతగానే మిగిలిపోయారు.2014 లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కావడం, వెను వెంటనే మంత్రి కావడం కూడా లోకేష్ కు మైనస్ అయింది. ఆయన ప్రజాసమస్యలపైన, పార్టీ పరిస్థితులపైన అవగాహన చేసుకునేందుకు వీలు చిక్కలేదు. పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను పర్యవేక్షిస్తుండటం సమయం చిక్కలేదు. పార్టీపై పట్టు పెంచుకునే ప్రయత్నమూ లోకేష్ చేయలేదు. అందుకే ఆయన జిల్లా పర్యటనల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయిన సందర్భాలున్నాయి.అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత లోకేష్ లో స్పష్టమైన మార్పు వచ్చింది. ప్రసంగాల్లో సయితం పరిణితి కన్పిస్తుంది. ట్విట్టర్ కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పార్టీలో పట్టు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కరోనాకు భయపడి పెద్దగా బయటకు రాకపోయినా టీడీపీ నేతలకు అండగా నిలబడటంలో లోకేష్ ముందుంటున్నారు. లోకేష్ లో వచ్చిన మార్పు టీడీపీలోనే చర్చనీయాంశమైంది. ఆయనను తమ నాయకుడిగా అంగీకరించేందుకు ఇప్పుడు టీడీపీ నేతలు పూర్తిగా సిద్దమయినట్లే కన్పిస్తుంది.