విజయవాడ, నవంబర్ 23,
బీజేపీ ఏపీలో నోటా కంటే వెనకబడిన అతి చిన్న పార్టీ. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ బలమైన నాయకుడు. ఆయన వేయి కాంతులతో వెలిగిపోతున్నాడు. ఆ వెలుగు జిలుగులలో కొత్త రంగులతో ప్రకాశించవచ్చునని జనసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. మరో రెండు నెలల్లో ఈ పొత్తుకు ఏడాది కాలం పూర్తి అవుతుంది. కానీ దీని వల్ల జనసేన ఏమైనా బాగుపడిందా అంటే డౌటే లేకుండా లేదు అనే సమాధానం ఆ పార్టీ వారి నుంచే వస్తుంది. పైగా జనసేన తెల్ల చొక్కా మీద ఎన్ని మరకలు పూయాలో అన్నీ పూసి ఆ పార్టీ ఇమేజ్ ని ఒక విధంగా బీజేపీ దెబ్బ కొట్టిందన్న బాధ కూడా కరడు కట్టిన పవన్ ఫ్యాన్స్ లో ఉంది.బీజేపీది పక్కా హిందూత్వ అజెండా. ఆ విషయంలో చెప్పుకోవడానికి ఆ పార్టీ గర్వపడుతుంది. పవన్ ది అలా కాదే. పైగా ఆయన లౌకిక వాదిగా కనిపిస్తారు. ఆయన సినీ జీవితానికి కూడా అందరూ కావాలి. ఇక పవన్ అభిమానించే చెగువీరాని సైతం పక్కన పెట్టేసేలా బీజేపీ వీర కాషాయం పంచెలు ఆయన చేత కట్టించింది. ఇక అమరావతి రాజధాని విషయంలో పవన్ మాట తప్పేలా కూడా బీజేపీ రాజకీయం సాగింది. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని చెప్పిన పవన్ బీజేపీ పొత్తుతో వారికి ఏం చెప్పాలో తెలియక సీన్ వెనక్కి వెళ్ళిపోయారని అంటారు.ఇక ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు అని పవన్ చెప్పుకుందామంటే ఆ మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్నారు. బీజేపీ ప్రత్యేకా హోదాను తెలివిగా సైడ్ చేసేసింది. ఇపుడు పోలవరం గొంతు నులుముతోంది. వీటికి తోడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న దాన్ని కూడా ప్రభుత్వానికి కాకుండా చేస్తున్నారు అని అంటున్నారు. విశాఖ ఉక్కులోని అతి పెద్ద భూములను పోస్కోకు అప్పగిస్తూ కేంద్రం తాజాగా ఒప్పందం చేసుకుంది. దీని వల్ల ఉక్కు కార్మికులు అంతా భయపడిపోతున్నారు. మరో వైపు వీఆర్ఎస్ ని కూడా స్టీల్ ప్లాంట్ బోర్డ్ ఆమోదించి మరీ పెద్ద ఎత్తున కార్మికులను ఇంటిని పంపడానికి రెడీ అయింది. ఈ పరిణామాలతో విశాఖలోని కార్మిక సంఘాలు రగులుతున్నాయి.వారంతా బీజేపీ నాయకులను దుమ్మెత్తిపోతున్నారు. ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్న జనసేన నాయకులను కూడా నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీదేనని కూడా వారికి గట్టిగా చెబుతున్నారు. దీంతో తల పట్టుకోవడం జనసేన నాయకుల వంతు అవుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక పరిధిలోకే విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తుంది. మరి ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను పవన్ అడ్డుకోగలరా. మోడీతో చెప్పి కార్మికుల వీఆర్ఎస్ ని ఆపించగలరా. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే పవన్ ఉక్కు సంకల్పం తీసుకుంటారా. లేక ఇదంతా నాకెందుకు అని మానుకుంటారా. మొత్తానికి బీజేపీ పెట్టే ఫిటింగులకు పవన్ సహా జనసైనికులకు నోరు కూడా మెదిపే చాన్స్ కూడా లేకుండా పోతోందిగా.