విశాఖపట్టణం, నవంబర్ 24,
విశాఖ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ లెవెల్ వేరు అంటారు. ఆయనది సీఎంలతో సమానంగా తిరిగే స్థాయి అంటారు. నాడు కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అయినా తరువాత చంద్రబాబు అయినా గంటా శ్రీనివాసరావు పక్కన కూర్చుని జిల్లా రాజకీయాలను శాసించారు. గంటా రాష్ట్రవ్యాప్తంగా పేరున్న నేత. అలాగే బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. అంతే కాదు, అర్ధబలం, రాజకీయ చాణక్యం ఆయనకు అదనపు ఆభరణాలు. గంటా శ్రీనివాసరావు ఇంతవరకూ వస్తానంటే ఏ పార్టీ కూడా నో చెప్పలేదు. డోర్స్ క్లోజ్ చేయలేదు.రాజకీయాల్లో అయినా మరే రంగంలో అయినా మంచి రోజులు గతించిపోతే ఎవరికైనా ఇంతేనేమో అన్నట్లుగా గంటా శ్రీనివాసరావు ప్రస్తుత సీన్ ఉంది. ఆయన ఫుల్ సైలెంట్ గా ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం తన అనుచరుడిని సీఐడి అధికారులు విశాఖలో అరెస్ట్ చేసినపుడు ఆయన గట్టిగానే విరుచుకుపడ్డారు. ఆయన వెనకాల నాడు టీడీపీ పెద్దలు కూడా నిలిచి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇపుడు ఏకంగా గంటా శ్రీనివాసరావు భూముల మీదనే వైసీపీ టార్గెట్ చేసి అక్రమ నిర్మాణాలు అంటూ కూలగట్టింది. దాని మీద కోర్టుకెళ్ళి గంటా స్టే అయితే తెచ్చుకున్నారు. కానీ ఆయన పక్షాన నిలబడి ఏంటిది జగన్ అంటూ ఒక్క తమ్ముడూ కూడా గర్జించకపోవడమే చిత్రం.విశాఖలో ఫ్యూజన్స్ ఫుడ్స్ అని ఒక అక్రమ లీజ్ తీసుకున్న టీడీపీ నేత ఉన్నారు. ఆయన పేరే హర్షవర్ధన్ చౌదరి. ఆయనకు లీజుకు ఇచ్చిన వుడా నిర్మాణాన్ని అధికారులు వెనక్కి తీసుకుంటే ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గయ్యిమన్నారు. ఇదేంటిది అంటూ గుడ్లు ఎర్ర చేశారు. మానవత్వం లేదా అంటూ వైసీపీ సర్కార్ మీద చాలా పెద్ద పదాలనే వాడారు. మరి ఆయన టీడీపీలో ఒక సాధారణ నాయకుడు. ఆయనతో పోలిస్తే గంటా శ్రీనివాసరావు బిగ్ షాట్. దానికి ఒక రోజు ముందే గంటా భూముల్లోకి రెవిన్యూ అధికారులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు. కానీ అచ్చెన్న కానీ అయ్యన్న కానీ గంటాకు మద్దతుగా మాట్లాడితే ఒట్టు. ఇక చంద్రబాబు అయితే ఈ విషయమే తమ పార్టీది కాదన్నట్లుగా గమ్మునున్నారు.గంటా శ్రీనివాసరావుకు ఇపుడు ఏ వైపూ దారిలేదు. ఆయనను వైసీపీ వద్దు అంటోంది. టీడీపీలో కనీసం పార్టీ పదవులు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు. రేపో మాపో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తర నియోజకవర్గానికి పార్టీ ఇంచార్జిని కూడా వేస్తారని అంటున్నారు. ఈ సమయంలో గంటా శ్రీనివాసరావు అధికార పార్టీకే కాదు, సొంత పార్టీకే టార్గెట్ అయ్యారు. దాంతో ఆయన చక్రబంధంలో చిక్కుకున్నారు. ఆయనకు ముందుకు పోయేందుకు దారి అంటూ లేదు. ఉంటే గింటే కచ్చితంగా టీడీపీలోనే ఉండాలి. అపుడు బాబు చెప్పినట్లుగా లొంగి వంగుతారనే ఈ రకంగా గంటా శ్రీనివాసరావును టచ్ మీ నాట్ అన్నట్లుగా దూరం పెట్టారని అంటున్నారు. మరి గంటాకు ఈ రెండు పార్టీల కంటే వేరే దారి ఉందా. ఉంటే గింటే కనుక అపుడు ఆయన సినిమా స్టార్ట్ అవుతుంది. అంతవరకూ గంటా సైలెంట్. అంతే.