గుంటూరు, నవంబర్ 24,
ఆది నుంచి వైసీపీకి బలమైన మద్దతుదారుగా ఉన్న మాల సామాజిక వర్గం.. ఇటీవల కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినా.. వారికి అధికారాలు అప్పగించ లేదని మాల వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో మాదిగ వర్గానికి జగన్ ఎక్కువప్రధాన్యం ఇస్తున్నారని, రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న మాలలను అణిచేస్తున్నారని కొన్నాళ్లుగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం పెత్తనం.. మాలలపై ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది.సీమతో పాటు ప్రకాశం, నెల్లూరు లాంటి చోట్ల ఎస్సీ నియోజకవర్గాల్లో మాల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల రెడ్లు పూర్తిగా డామినేషన్ చేస్తూ వారిని డమ్మీలను చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే ఉన్నాయి. ఇక కేబినెట్ లో ఉన్న మాల మంత్రులకు కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. మాల వర్గానికి చెందిన ఓ మంత్రిని కూడా తమ కనుసన్నల్లోనే పనిచేయించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారని.. అంతా రెడ్డి వర్గం మోచేతి నీళ్లు తాగాల్సి వస్తోందనే భావన మాలల్లో ఇటీవల కాలంలో పెరిగింది.మరోవైపు కారెం శివాజీని ఎంతో ఘనంగా పార్టీలో చేర్చుకున్నా ఆయనకు స్వేచ్ఛను ఇవ్వలేదని.. ఇక, పదవి ఇచ్చి కూడా ప్రయోజనం ఏంటనేది మాల వర్గం డిమాండ్. మరో నాయకుడు జూపూడి ప్రభాకర్ కూడా తనకు పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. మరోవైపు మాల సామాజిక వర్గంపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోవడం కూడా ఆ వర్గాన్ని కలవరపా టుకు గురిచేస్తోంది. దీనిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీలో వీరికి ప్రాధాన్యం పెంచారు. అంటే.. పరోక్షంగా మాల సామాజిక వర్గం ఓట్లను సైకిల్‌వైపు తిప్పుకొనేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీంతో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో తిప్పలు తప్పవనే భావన వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే, ఈ సెగనుంచి బయటపడేందుకు మాల వర్గానికి చెందిన ఉద్యమకారుడు.. గతంలో పార్టీ పెట్టుకుని బీఎస్పీలో విలీనం చేసిన.. కత్తి పద్మారావును వైసీపీలోకి చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఆయన పార్టీలోకి వస్తే.. మాలలు వైసీపీ వైపే ఉంటారని భావిస్తోంది. కారంచేడు దళితుల ఊచకోత కాలం నుంచి కత్తి పద్మారావు దళితుల్లో మంచి గుర్తింపు పొందారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా చట్టసభల్లోకి మాత్రం వెళ్లలేదు. గతంలో ఆయన కాంగ్రెస్ మద్దతుతో 1994లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన్ను పార్టీలో చేర్చుకుని చట్టసభలకు పంపే ప్లాన్‌లో ఉందని తెలుస్తోంది. మరి ఈప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.