విశాఖపట్టణం, నవంబర్ 24,
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారింది. రాగల 12 గంటల్లో ఇది తుఫాన్‌గా, తదుపరి 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. బుధవారం (నవంబర్ 25) సాయంత్రం తమిళనాడులోని మామళ్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్‌కు నివర్ (Nivar) అని పేరు పెట్టనున్నారు. ఈ పేరును ఇరాన్ సూచించింది.ఈ వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 480 కి.మీ. దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.ఈ తుఫాన్ కారణంగా తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరిలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కడల్లోర్, విల్లుపురం, పుదుచ్చేరి తదితర జిల్లాల్లోని తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమిళనాడు తీరానికి సమీపంలోని పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలను మోహరించారు. కొస్ట్ గార్డ్ నౌకలను సిద్ధంగా ఉంచారు. తమిళనాడులోని 7 జిల్లాల్లో బస్సు, రైలు సేవలను నిలిపివేశారు.ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం నుంచి, తెలంగాణలో బుధవారం నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.