విజయవాడ, నవంబర్ 24,
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించాలనుకున్నారు.. రెండుసార్లు సీఎస్‌కు లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా నిమ్మగడ్డ మరో లేఖ రాసినట్లు తెలుస్తోందిస. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహాయ, సహకారాలు అందించాలని సీఎస్ నీలం సాహ్నికి ఎస్ఈసీ లేఖ రాసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఆ లేఖతో పాటూ పంపించారట.ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్‌పై (రిట్ పిటిషన్ నం.19258) హైకోర్టు ఈ నెల 3న ఇచ్చిన తీర్పును ఆయన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోసం ఎన్నికల సంఘం మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించిన విషయాన్ని ప్రస్తావించారట. సోమవారం తమకు కోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే లేఖ రాస్తున్నామని.. ఎన్నికల సంఘం వినతిపై ప్రభుత్వం స్పందించి, అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర సహకారం అందించాలని కోరారట. ఆర్థిక, పంచాయతీరాజ్‌శాఖల ముఖ్య కార్యదర్శుల్ని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారట. ఈ లేఖపై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది.