YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*చర్య- ప్రతి చర్య*

*చర్య- ప్రతి చర్య*

మన సంకల్పాలు అన్నీ సఫలం కాకపోయినా కొన్నయినా ఫలిస్తాయని ఆశిస్తాం. ఒక్కోసారి ఏ కార్యమూ నెరవేరదు. అప్పుడు అనిపిస్తుంది, విధి బలీయమని, భగవంతుడు నిరంకుశుడని! అన్నీ మనిషి అనుకున్నట్లు జరిగితే భగవంతుడి అవసరం ఉండదు. దైవం దృష్టిలో ప్రీతిపాత్రులైనవారు లౌకిక జగత్తులో ఎందుకూ కొరగాకపోవచ్చు. ప్రముఖులమనుకొనేవారికి పరమేష్ఠి గణనలో చోటు దక్కకపోవచ్చు. మానవుడు చట్టాలు చేసి వాటి పరిధిలో జీవిస్తాడు. చట్ట స్పృహ సుఖజీవన సౌధానికి సోపానం. చట్ట అతిక్రమణ వల్ల కొందరు నష్టపోతారు. న్యాయవ్యవస్థ ద్వారా ఒక్కోసారి న్యాయం అందకపోవచ్చు. బాధితులకు చట్టాలవల్ల న్యాయం జరగనప్పుడు వారి గోడు విశ్వ శూన్యంలో కలిసిపోతుంది.  ప్రతి చర్యకూ ‘ప్రతిచర్య’ ఉంటుందన్న సూత్రం ప్రకారం శాంతిఘాతకులను ప్రకృతి శిక్షిస్తుందని విశ్వప్రేమికుల భావన. బతుకు-బతకనివ్వు అనే సూత్రం శాంతికాముక విశ్వమనుగడకు ఆధారం. కొందరు శారీరక బలవంతులు పాశవిక కృత్యాలకు ఒడిగడతారు. బాధితులకు ప్రభువులే శ్రీరామరక్ష. పాలకుల రక్షణ లభించనప్పుడు దైవమే దిక్కు. ప్రపంచం దుఃఖంతో నిండిపోయినప్పుడు ఆర్తజ నోద్ధరణకు తాను అవతరిస్తూ ఉంటానన్నది పరమాత్మ వాగ్దానం. అధికారం, ధనం సజ్జనుల పరమైతే వారికి గౌరవం, ఆశ్రితులకు రక్షణ లభిస్తాయి. దుర్జనుల వశమైతే మరెందరో దుర్మార్గులు రెచ్చిపోతారు. అది మరెన్నో దుష్కార్యాలకు కారణమవుతుంది. దుర్యోధనుడి కొలువులో కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు బృందంగా ఏర్పడి ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. తుదకు తమ సామ్రాజ్యాన్ని, ప్రాణాలను కోల్పోయారు. పాండవులు, వారి పరిజనం అడుగడుగునా పరమాత్మ రక్షణ పొందుతూ కష్టాలనుంచి విముక్తి పొందారు. .
భారత దేశం వేదభూమి. ఇక్కడి ప్రతి రేణువూ ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తుంది. అందుకేనేమో ఆత్మ విషయానికి వస్తే ప్రపంచం చూపు భారత దేశంపైనే ఉంటుంది. ఇక్కడి గురువులను ఆశ్రయించి ఆత్మవిద్య నేర్చుకొని జన్మ ధన్యం చేసుకుంటారు పాశ్చాత్యులు. గత పాపకర్మల ఫలంగా గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని ప్రతీతి. అవే ప్రారబ్ధాలు! ప్రారబ్ధాల వల్ల మంచి ఫలితాలు సైతం అందుతాయి. దైవనిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందన్నది ఓ విశ్వాసం. భవిష్యత్తు ఎలా ఉండనుందో సామాన్యులు ఎవరికీ తెలియదు. కాలాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. ఓ అదృశ్యశక్తి కాలాన్ని నడిపిస్తుందని భావించడం తప్పు కాదు. మానవుడు అనిశ్చిత భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాడు. అతడి కార్యకుశలత పరిమితమైనది. మంచిని పంచడంవల్ల మంచే తిరిగి వస్తుందన్నది ప్రామాణిక సత్యం. ఒకరు ఏం చేస్తే ఆనందం కలుగుతుందో అదే ఆచరించి ఆనందం అందివ్వవచ్చు. నేలకు కొట్టిన రబ్బరు బంతిలాగా ఆనందం తప్పక మన దరి చేరుతుంది. శాంతియుత జీవనం సాధ్యమైనప్పుడు స్పర్ధలతో పనేమిటి? శిష్ట రక్షణ దైవ వాగ్దానం! దుర్బలురు సైతం ఆనందంగా బతికేందుకు సహాయపడటం దైవానికి ప్రీతిపాత్రం. మంచిని అందించి మంచిని తిరిగి పొందడం మానవత్వానికి సంకేతం. ఆ బాటన పయనించి విశ్వమానవ కల్యాణ కేతనాన్ని ఎగురవేద్దాం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts