విశాఖపట్టణం, నవంబర్ 25,
విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో ఆ ఎమ్మెల్సీ ఇపుడు బాగా ముందుకు వస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎక్కడా వినబడని ఆ గొంతుకే ఇపుడు బిగ్గరగా సౌండ్ చేస్తోంది. ఆయనే అనకాపల్లికి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు. బలమైన గవర సామాజికవర్గానికి చెందిన ఆయన్ని చంద్రబాబు కూడా బాగానే ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా పార్టీ పదవుల్లోనూ సముచితమైన స్థానం ఇచ్చారు. బాబుకు వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న బుద్ధ తనకు ఇచ్చిన గౌరవానికి తగిన న్యాయం చేస్తున్నారు.విశాఖ రూరల్ జిల్లాలో ఒకపుడు ఉద్ధండులైన నాయకులు టీడీపీకి ఉండేవారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ తరఫున గట్టిగా వాదించేవారు. నాడు వైఎస్సార్ జమానాలో దాడి లాజిక్ పాయింట్లతో కాంగ్రెస్ సర్కార్ ని శాసనమండలి లోపలా బయటా ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే ఆ తరువాత ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక 2014 ఎన్నికల నాటికి బుద్ధా నాగజగదీశ్వరరావు ముందుకు వచ్చారు. అనకాపల్లి పట్టణ ప్రెసిడెంట్ గా ఆయన పార్టీకి విశేష సేవలు అందించారు. దాంతో ఎమ్మెల్యే అవాలనుకున్నారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణ నేపధ్యంలో పీలా గోవిందుకు చంద్రబాబుఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆయన గెలవడం జరిగింది. అయితే పీలా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా సబ్జెక్ట్ మీద మాట్లాడరు, ఇక 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దాంతో రూరల్ జిల్లా నుంచి పెద్ద దిక్కుగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా ఇపుడు బుద్ధా కనిపిస్తున్నారు.బుద్ధా ఎమ్మెల్సీ పదవీ కాలం 2022లో పూర్తి అవుతుంది. ఆయనకు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. మరి చంద్రబాబు 2024 ఎన్నికల నాటికి అనకాపల్లి టికెట్ ఇస్తారా అన్న దాని మీదనే బుద్దా రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. బుద్దా అయితే ఎవరి మద్దతు లేకుండానే సొంత రాజకీయం చేస్తున్నారు. అంగబలం ఉన్నా అర్ధ బలం లేదు. మరి రేపటి రోజున అనకాపల్లి టికెట్ రేసులో ఎవరైనా బడా నేత పోటీకి వస్తే అపుడు ఆయన ఆశలు ఆవిరి అవుతాయని అనుచరులు మధనపడుతున్నారు. మరోమారు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే పీలా ట్రై చేస్తారని కూడా అంటున్నారు.మంత్రులు అయిన వారు, అధికారాన్ని నిండుగా అనుభవించిన వారు టీడీపీని వీడిపోయారు. మరికొందరు సరైన వేళలో సైలెంట్ అయ్యారు.. ఈ టైంలో బుద్దా లాంటి వారు ముందుకు వచ్చి పార్టీని నిలబెడుతున్నారు. రూరల్ లో ఎంతో బలంగా ఉన్న వైసీపీని గట్టిగానే ఢీ కొడుతున్నారు. ఆ విధంగా రూరల్ జిల్లాలో తెలుగుదేశానికి జవం జీవం కలిపిస్తున్నారు. మరి బుద్ధాకు చంద్రబాబు మాట ఇవ్వాలని, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు గట్టిగా కోరుతున్నారు. ఇక అనకాపల్లి లోకల్ కే ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా మరో వైపు నినాదం ఊపందుకుంటోంది. నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతున్న బుద్దా పట్ల జనంలోనూ సానుకూలత ఉందని అంటున్నారు. మరి అన్నీ కలిస్తే బుద్ధ ఆశలు నెరవేరుతాయని అంటున్నారు.