విజయవాడ, నవంబర్ 25,
కమలానికి చంద్రుడుకి ప్రకృతి పరంగా చూస్తే అసలు పొసగదు. కానీ రాజకీయ చంద్రుడికి మాత్రం కమలంతో పొత్తులు పొడుస్తూ విడుస్తూ ఒక గ్రహణం మాదిరిగా ఆ ప్రహసనం సాగిపోతూనే ఉంటుంది. బీజేపీని చంద్రబాబు నమ్మరు, కానీ నమ్మినట్లుగా నటిస్తారు. కమలం పెద్దలది డిటో కేసే. వారు కూడా చంద్రబాబు అంటే అమ్మో అనుకుంటారు. అలాంటిది మరి చంద్రబాబు గారి ట్రాక్ రికార్డ్. కానీ ఇద్దరినీ రాజకీయమే కలుపుతోంది. ఇక 2024 నాటికి అలాంటి సీన్ ఉంటుందా అంటే ఏమో ఎవరు చెప్పగలరు అన్నది రాజకీయం తెలిసిన పండితుల మాట.ఇక ఏపీలో బీజేపీ గర్వం, గౌరవం ఇపుడు ఎక్కడికో వెళ్ళిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ అధినేత నరేంద్ర మోడీ జపాన్ని ఈ దేశం ఇంకా కొనసాగిస్తోంది. బలమైన ప్రధానిగా మోడీ ఉన్నారు. ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారం చూసుకుంటే హ్యాట్రిక్ ప్రధానిగా 2024 నాటికి మళ్ళీ నెగ్గి రికార్డు సృష్టించేలా ఉన్నారు. దాంతో మోడీ వరకూ ఎందుకు ఏపీ నేతల కంట్లో కూడా అసలు చంద్రబాబు కనబడరన్నది వాస్తవం. అంతే కాదు, చంద్రబాబు జట్టు కడదామని ఎంత వెంపర్లాడినా బీజేపీ నేతలు బెట్టు చేస్తారు తప్ప కొండ దిగి రానే రారు.పొరుగున ఉన్న తెలంగాణాలో రెండవ పక్షంగా ఉన్న కాంగ్రెస్ ని నెట్టేసి మరీ బీజేపీ ఇపుడు ముందుకు దూసుకు వచ్చేసింది. బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికలో చేసిన రీ సౌండ్ కి తెలుగు రాష్ట్రాలు రెండూ గింగిరాలు కొట్టాయి ఇక టీఆర్ఎస్ కి సరైన జవాబు చెప్పిన తెలంగాణా బీజేపీ నేతలను చూసి ఏపీ బీజేపీ నేతలు కాలరెగరేస్తున్నారు. ఏపీలో కూడా రెండవ స్థానంలో ఉన్న టీడీపీని దిగలాగడమే తమ లక్ష్యమని గట్టిగానే శపధాలు చేస్తున్నారు.ఏపీలో తక్షణ ముప్పు మాత్రం టీడీపీకి ఉన్నట్లుగా అర్ధమవుతుంది. ఏపీలో బీజేపీ ఉన్నఫళంగా అధికారంలోకి వచ్చే సీన్ లేదు. తెలంగాణాలో కొంత బేస్ ఉంది కాబట్టి హడావుడి చేసినా అర్ధం ఉంది. కానీ ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దాంతో బీజేపీ ముందు చేసే పని తన బలం పెంచుకోవడం. దానికి అడ్డుగా ఉన్న టీడీపీని ఎలిమినేట్ చేయడం. అలా ఆలోచించినపుడు చంద్రబాబుకు కమల గండం గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక ఏపీలో బీజేపీకి సులువుగా ట్రాన్స్ ఫర్ అయ్యే ఓటు బ్యాంక్ కూడా టీడీపీదేనని చెప్పడంలో సందేహం లేదు. జగన్ వైపు ఉన్న మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు కనీసంగా కూడా బీజేపీ వైపు తొంగి చూడరు. దాంతో ఇక మీద టీడీపీ టార్గెట్ గా బీజేపీ ఏపీ లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు.