విజయవాడ, నవంబర్ 25,
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సంకేతాలు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కోణంలో వాయిదా వేయడంతో జగన్ నిమ్మగడ్డతో తాడోపేడో తేల్చుకున్నారు. జగన్ నిమ్మగడ్డను తప్పించి జస్టిస్ కనకరాజ్‌ను కొత్త ఎన్నికల అధికారిగా నియమించినా నిమ్మగడ్డ కోర్టు ద్వారా తిరిగి ఎన్నికల అధికారిగా నియమితులు అయ్యారు. నిన్నమొన్నటి వరకు జగన్ ఏపీలో వచ్చే జనవరి 26న కొత్త జిల్లాల ప్రకటన చేసి.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నారు. నిమ్మగడ్డ పదవీ కాలం మార్చితో ముగుస్తోంది. ఆ తర్వాత కొత్త ఎన్నికల అధికారి వచ్చాక.. కొత్త జిల్లాలతోనే ఎన్నికలకు వెళ్లి సత్తా చాటాలని భావిస్తున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్ నియమించిన కమిటీ సైతం అనేక కసరత్తులు చేసి కొత్త జిల్లాలను ఎలా ? ఏర్పాటు చేయాలనే అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చింది. కొత్త జిల్లాల ప్రకటన తర్వాత.. అది కూడా నిమ్మగడ్డ పదవీ కాలం ముగిశాక ఎన్నికలకు వెళితే తన పంతం నెగ్గడంతో పాటు తన పార్టీ నేతలకు భారీ ఎత్తున పదవులు వస్తాయని జగన్ ముందు నుంచి ప్లాన్‌తో ఉన్నారు. అయితే ఇప్పుడు తప్పనిసరిగా ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఛాన్సులు ఉండడం జగన్‌ను ఇరకాటంలో పడేసినట్లయ్యింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈ లోగా జిల్లాలను ప్రకటించినా.. విభజన పూర్తి కాదు.. మళ్లీ కొత్త జిల్లాల రిజర్వేషన్లు కూడా ఓ కొలిక్కి రావు. ఈ లెక్కన చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే కొత్త జిల్లాలు ఏర్పాటు కావొచ్చు.కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ యంత్రాంగం కూడా దూకుడుగానే ఉంది. 32 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తానేటి వనిత సైతం ప్రకటించారు. జగన్, వైసీపీ ప్రభుత్వ ఆలోచన ఇలా ఉంటే నిమ్మగడ్డ దీనికి అడ్డు పుల్లే వేసేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలను విభజించవద్దని… పాత 13 జిల్లాల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. అంత సమయం కూడా లేకపోవడంతో జగన్ కొత్త జిల్లాల కోరిక కూడా ఇప్పట్లో నెరవేరదు. సో నిమ్మగడ్డ జగన్ మరో ప్లాన్‌కు ఇలా బ్రేక్ వేశారనే అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసీని కాదని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఈ పరిణామాలన్ని జగన్ దూకుడుకు మరో బ్రేక్ అనే చెప్పాలి.కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే పదవుల కోసం అర్రులు చాస్తోన్న వైసీపీ నాయకులకు కావాల్సినన్ని పదవులు వచ్చి పడతాయి. జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయాలు ఇలా ఒకటేమిటి చాలా మంది కీలక నేతలకు పదవులు దక్కుతాయి. పార్టీలో పదవులు లేవని ఆవేదనతో ఉన్న వారి అసంతృప్తి కూడా కాస్త చల్లారుతుంది. ఇలా కొత్త జిల్లాల ఏర్పాటుతో తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీతో పాటు అనేక విధాలా ప్లస్ అయ్యేలా వేసుకున్న స్కెచ్ ఇప్పుడు నెరవేరేలా లేకపోవడం జగన్‌ను ఇరకాటంలో పడేసినట్లయ్యింది.