ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న టిడిపి వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం అవుతుందని వైఎస్సార్సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ సింగనమల నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్లుగా అధర్మ పాలన సాగిస్తూ ధర్మ పోరాట దీక్ష అంటూ కొంగ జపం చేస్తారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలే టీడీపీకి ఆఖరి ఎన్నికలు అవుతాయి. ఆ పై ఆ పార్టీని ఓటర్లు బంగాళాఖాతంలో కలిపేస్తారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఈ నాలుగేళ్లలో హామీలను తీర్చకపోగా, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన విదేశీ పర్యటనలు, విలాస భవనాలతో మరింత లోటులో పడేశారని ఆమె ఆరోపించారు. అటువంటి వ్యక్తి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలనూ గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పేస్తామంటూ పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై అనేక సార్లు మాట మార్చి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపడతానని చెప్పడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం ఏపీ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత కూడా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ లభించిందని ప్రజలను ఎందుకు మోసం చేశారు? స్వచ్ఛందంగా ప్రజలు హోదా కోసం పోరాడుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసమే నిరాహార దీక్షకు పూనుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీసారు. # ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందంటే మా నాయకుడు వైఎస్ జగన్ పోరాట ఫలితమే. 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి ఉంటే దేశం మొత్తం చర్చ జరిగేది. మీ పార్టీ ఎంపిలతో ఎందుకు రాజీనామా చేయించలేదని అడిగారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను చంద్రబాబు ఇంకా చేస్తునే ఉన్నారు. నిరాహార దీక్ష చేసి మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచీ పోరాడుతున్నాం.. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట తప్పారు. హోదా కోసం వైఎస్ జగన్, మా పారీ నేతలు అలుపెరగని పోరాటం చేస్తుండటంతో వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకుని ఇప్పుడు హోదా కావాలంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
ఘనంగా విజయమ్మ జన్మదిన వేడుకలు
వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జొన్నలగడ్డ పద్మావతి కేక్ కట్ చేసి నేతలకు అందజేశారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు హాజరయ్యారు.