విజయవాడ, నవంబర్ 25,
పాలిటిక్స్‌లోనే స్పెషల్ పాలిటిక్స్ చేయడంలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్న విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. టీడీపీలో ఉంటూనే అసమ్మతి నాయకుడిగా స్వపక్షంలో విపక్ష నేతగా ఆయన కొన్నాళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. 2014లో రవాణా వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి (ఇంతకు ముందే వచ్చారు) వచ్చి విజయవాడ ఎంపీగా టికెట్ పొంది.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. అప్పట్లోనే తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే అయినప్పటికీ గుర్తింపులేకుండా పోయిందనే భావనను ఆయన వ్యక్తం చేసేశారు.ఇదే అసంతృప్తికి దారి తీసి.. పార్టీలో నేతలపై ఆయన విమర్శలు చేయడం, ఏకంగా మాజీ మంత్రి తన సామాజిక వర్గానికే చెంది దేవినేని ఉమపైనా, ఎమ్మెల్సీ, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నపైనా విమర్శలు చేయడం తెలిసిందే. ఇక, రెండోసారి కేశినేని నాని గత ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని గెలిచారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మాత్రమే టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. ఈ క్రమంలో పార్లమెంటరీ పక్ష నాయకుడిగా తనకు అవకాశం దక్కుతుందని అనుకున్న కేశినేని నానికి నిరాశే ఎదురైంది. గుంటూరు ఎంపీ గల్లా ఈ పదవిని దక్కించుకున్నారు. దీంతో ఇద్దరు ఎంపీలకు దక్కుతున్న గౌరవం, పదవులు కూడా తనకు లభించడం లేదనే ఆవేదనలో ఉన్నారు.పార్టీలో మరో ఇద్దరు ఎంపీలు రామ్మోహన్ నాయుడుకు, గల్లా జయదేవ్‌కు ఉన్న ప్రాధాన్యత నానికి లేకుండా పోయిందన్నది వాస్తవం. ఈ క్రమంలోనే ఏకంగా ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ కొన్నాళ్లు ట్వీట్లు చేశారు. ఒకానొక సందర్భంలో పార్టీలో కేశినేని నాని వ్యవహార శైలిపై తీవ్ర చర్చ సాగింది. ఇక, తాజాగా కూడా ఆయనకు పార్టీలో పదవులు దక్కలేదు. మరి ఆయనే పార్టీని వద్దనుకుని దూరంగా ఉన్నారో లేక పార్టీనే ఆయనను వద్దనుకుని దూరం పెట్టిందో తెలియదు కానీ. తాజాగా కీలకమైన పార్లమెంటరీ జిల్లా కమిటీలు, పార్లీ పొలిట్ బ్యూరో సభ్యులను కూడా నియమించారు. వీటిలో వేటికీ కూడా కేశినేని నాని పేరును ప్రతిపాదనకు కూడా తీసుకోలేదు.అదే సమయంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహా.. బొండా ఉమామహేశ్వరరావుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, వర్ల రామయ్యకు కూడా అవకాశం కల్పించారు. వీరంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారే. దీంతో ఇప్పుడు కేశినేని నాని మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని.. పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో అసంతృప్తితో దేవినేని ఉమ, చంద్రబాబు, బుద్ధా వెంకన్నలను టార్గెట్ చేసిన కేశినేని నాని.. త్వరలోనే బిగ్ బాంబ్ పేల్చుతారని బెజవాడ తమ్ముళ్లు చర్చించుకోవడం గమనార్హం. ఈ సారి పార్టీలో అంతర్గతంగా జరిగిన విషయాల గుట్టు కేశినేని నాని రట్టు చేస్తారంటున్నారు. మరి నాని ఏం చేస్తారో ? ఏం బాంబు పేలుస్తారో ? చూడాలి.