ఏలూరు, నవంబర్ 26,
వైసీపీ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో మనకు తెలియదు. 2014 ఎన్నికలకు ముందు వీరు మంచి దోస్త్‌లు. ఆ ఎన్నికలకు ముందు జగన్ రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ ఇన్‌చార్జ్ ఇవ్వడంతో పాటు ఆయనే పోటీ చేస్తారని చెప్పారు. సడెన్‌గా ఎన్నికలకు ముందు రఘురామ జగన్‌ను తీవ్రంగా తిట్టి వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారు. కట్ చేస్తే గత ఎన్నికలకు ముందు మళ్లీ వీరిద్దరు దోస్త్‌లయ్యారు. మధ్యలో రఘురామ కృష్ణంరాజు బీజేపీకి టాటా చెప్పి టీడీపీలో చేరి అదే నరసాపురం పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుకు, టీడీపీకి బైబై చెప్పేశారు. రఘురామ పార్టీలో చేరిన వెంటనే జగన్ కండువాతో పాటు నరసాపురం ఎంపీ సీటు ఇవ్వడం.. ఆయన గెలవడం జరిగిపోయాయి. రఘురామ కృష్ణంరాజు ఎంపీ అయ్యి నెల రోజులు అయ్యిందే లేదో వైసీపీతో గిల్లికజ్జాలు మొదలయ్యాయి.ఎంపీ అయిన కొద్ది రోజులకే బీజేపీతోనూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ అంట కాగుతోన్న రఘురామ కృష్ణంరాజును చివరకు పార్టీ నుంచి వదిలించుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఆయన ఎంపీ సభ్యత్వాన్నే రద్దు చేయాలని స్వయంగా వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆ పంచాయితీ తేలకపోయినా రఘురామ కృష్ణంరాజును వదిలించుకునేందుకు వైసీపీ.. వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు మానసికంగా సిద్ధమైపోయారు. రఘురామను తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ వాళ్లు సవాళ్లు రువ్వుతుంటే అటు రఘురామ కూడా అమరావతి రెఫరెండెంగా తాను తన ఎంపీ పదవిని వదులుకుని ఉప ఎన్నికలకు వెళ్లి జగన్‌పైనే గెలుస్తానని సవాల్ చేస్తున్నారు.ఉప ఎన్నిక వస్తుందా ? లేదా ? అన‌్నది పక్కన పెడితే నరసాపురం పార్లమెంటు పరిధిలో రఘురామ కృష్ణంరాజు ప్లేస్‌ను జగన్ అప్పుడే భర్తీ చేసేశారని వైసీపీ వాళ్లే అంటున్నారు. నరసాపురం మాజీ ఎంపీ అయిన గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజును ఆఘమేఘాల మీద పార్టీలో చేర్చుకున్న జగన్ ఆ వెంటనే రంగరాజుకు నరసాపురం పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించేశారు. అవసరమైతే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయినా సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారట. రఘురామ కృష్ణంరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇప్పుడు అదే వర్గానికి చెందిన, ఆర్థికంగా బలంగా ఉన్న రంగరాజునే రఘురామపై ప్రయోగించాలని జగన్ స్కెచ్ వేశారు.వైవి. సుబ్బారెడ్డి మాత్రం రంగరాజును బాగా ప్రోత్సహిస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది. ఉప ఎన్నిక వచ్చినా రాకపోయినా నెక్ట్స్ అయినా రంగరాజుదే నరసాపురం పార్లమెంటరీ టిక్కెట్. రంగరాజు మాత్రం అటు నరసాపురం పార్లమెంటు పరిధితో పాటు ఉండి అసెంబ్లీ సీటుపై కూడా కాన్‌సంట్రేషన్ చేస్తూ తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు