దేశంలో ఇప్పుడు సరఫరా చేస్తున్న దానిలో 10 శాతం నగదును తెలుగు రాష్ట్రాలకే పంపుతున్నా సమస్య ఎందుకు తీరడం లేదో బ్యాంకర్లకు అర్థం కావడం లేదు. అది పరిమితికి మించిన సమస్యగా మారడంతో కేంద్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బడా కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు చెక్కులు జారీ చేస్తున్నారు. ఇదంతా సబ్ కాంట్రాక్టర్ల పేరుతో జరుగుతోంది. చిన్న కాంట్రాక్టర్లంతా వాళ్లకు వచ్చిన చెల్లింపులను ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే ఇక్కడే మతలబు ఉంది. కొన్ని కేసుల్లో అసలు సబ్ (చిన్న)కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో ఏ పని చేయడం లేదని పన్ను అధికారులు గుర్తించారు. అందుకే గత కొన్ని వారాల్లో పెద్ద మొత్తాల్లో నగదు విత్ డ్రా చేసిన వ్యక్తులు, సంస్థలపై దృష్టి సారించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. నగదు కొరతపై పన్ను అధికారులు అన్ని పాజిబుల్ కోణాల్లోనూ విశ్లేషిస్తున్నారు. కర్ణాటకలో ఎన్నికలు, రానున్న సంవత్సరంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే నగదును పట్టి ఉంచడం చేస్తున్నారేమోనన్న అనుమానం కూడా అధికారుల్లో ఉంది. మరో వైపు జమిలీ ఎన్నికలు వస్తే ముందస్తు ఎన్నికలు రావచ్చేమో అనే కారణంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో నగదు ఎక్కువగా జమ చేస్తున్నారన్న కోణంలో కూడా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. వీలున్న అన్ని కోణాల్లో తమ దర్యాప్తును సాగిస్తున్నారు.