లోకం అంతా కాంతి తో ప్రకాశిస్తున్నది. జీవకోటి మనుగడకు వెలుగు ప్రధానం. కాంతిని మించిన దైవం ఏమున్నది? అందువలననే 'దేవ 'అనే
మాటకి ప్రకాశ స్వరూపమనే అర్థంగా శాస్త్రాలు తెలుపుతున్నాయి. కాంతిని శక్తిగా పూజించే సంప్రదాయాన్ని మన ఋషులు వేదకాలం నుండి అనుసరిస్తున్నారు. భూమి మీద వున్న వృక్షాలు ప్రాణి కోటి , సర్వానికి జీవశక్తి ని కలిగించే మూలాధారం సూర్యభగవానుడు అని ధ్యాన దృష్టి తో గ్రహించిన వేద యోగులు అనేక రహస్యాలు తెలుసుకుని మంత్రరూపాలలో వేద విజ్ఞానాన్ని విశద పరిచారు. సూర్యునిలోని అగ్నికి చిహ్నంగా అగ్ని హోత్రాన్ని పూజించే యజ్ఞ విజ్ఞానాన్ని ఋషులు మనకి బోధించారు. యజ్ఞాగ్ని ద్వారా విశ్వాన్ని పాలిస్తున్న దేవతలతో సంబంధం ఏర్పరుచుకున్నారు. అగ్ని సాక్షి అనేది ముఖ్య కార్యంగా, సర్వ కార్యక్రమాలలో అనుసరించే
ఆచరణగా మారింది. 'అగ్ని ముఖావై దేవాః' అనేది వేద వాక్యం. దేవతలు అగ్నిముఖులు. ముందు ప్రతిష్టించినవారు. వారికి మనం విన్నపం చేసుకోవాలంటే, వారి అనుగ్రహం మనకి కావాలన్నా మధ్యలో అగ్ని వుంటుంది. అందుకనే ' అగ్ని దూతం గృణీమహే' అంటున్నది శృతి. మెల్లమెల్లగా మన సంప్రదాయం లో శైవం, వైష్ణవం, శాక్తేయం అని మత బేధాలు కలిగినా , అన్ని మతాల వారు పారంపర్యంగా అగ్ని హోత్రాన్ని పూజించే ఆచారం సహజమై వున్నది. దేవతల శరీరాలు తేజోమయమైవుంటాయి. అందువలన ప్రకాశవంతమైన స్వరూపాలుగా దేవతలని పూజిస్తున్నాము. అంతే కాకుండా దేవతలను వర్ణించే మంత్రాలలో సూక్ష్మ చైతన్యము , ప్రకాశవంతమైన కాంతిగా వున్నదని ఋషులు దర్శించిన రూపం. ఆయా దేవతల తత్వాలని అనుసరించి వారి కాంతి వర్ణాలు కూడా నిర్ణయించ బడుతున్నాయి. సరస్వతీ దేవి శ్వేత వర్ణమని; కాళికాదేవి నీల వర్ణమని లక్ష్మీదేవి బంగారు ఛాయగా: లలితాదేవి ఎఱుపు వర్ణంగా పురాణాలలో వర్ణిస్తారు. ఈ వర్ణాలన్ని ప్రకాశించే కాంతుల లీలలే. వర్ణాలన్ని కాంతి రూపాలే. నిజానికి, ఏ వెలుగు లేని శుధ్ధ కాంతి కొన్ని పరిణామాల వలన కంటికి కనిపిస్తున్నాయి అనే విజ్ఞాన శాస్త్రం కూడా మనభారతదేశం వేదకాల వేదాంతులు దర్శించిన దర్శనాలకి సమీపంగానే వున్నది. ఏ వర్ణము లేని నిరంజన ,నిర్గుణ పరమతత్వమే , లోకాన్ని సృష్టించడానికి , వేరు వేరు రూపాలతో , సగుణ రూపంగా సాక్షాత్కరిస్తున్నయని మన వేద విజ్ఞానం యొక్క అభిప్రాయం. ఆఖరికి కాంతిని పూజించే తత్వమే'భా' రతంగా విస్తరించినది. జ్యోతినే జ్ఞానానికి చిహ్నంగా భావించడం విజ్ఞాన భావం. అజ్ఞానాన్ని అంధకారంతోను , జ్ఞానాన్ని వెలుగుతోను పోల్చడాన్ని అన్ని మతములలోను చూస్తున్నాము. ' అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ' అనే ప్రార్ధన వేదంలో ప్రసిద్ధి చెందినది. దుఃఖం, అజ్ఞానం , దరిద్రం, భయం అనే గుణాలు అన్నీ అంధకారశక్తులుగా పోల్చారు. వాటికి మారు రూపైన జ్ఞానం ,ఐశ్వర్యం, ఆనందం మొదలైన శక్తులను దైవగుణాలుగా ప్రేమించారు. కాని తత్వజ్ఞానము పెరిగి విస్తరించి ఆత్మజ్ఞానాన్ని వెలుపల ప్రకటించుకునేలా అంతర్ముఖ దృష్టిని ' కాళరాత్రి ' గా ఒక అద్భుత దృష్టి కూడా మన ఆచారాలలో వున్నది. 'అత్రి సూక్తమ్' ' కాళీ తత్వం' వంటి గ్రంధాలు జ్ఞానానికి అందని, అంతంలేని తత్వాన్ని దర్శించే వైభవానికి ఉదాహరణలు.
ఆశ్వీయుజ కృష్ణ పక్ష చతుర్దశి ని కాళరాత్రి అని ఆగమాలు కీర్తిస్తున్నాయి. మన దేశంలో ఆ రోజు రాత్రి కాళికాదేవికి పూజలు పలు ప్రాంతాలలో జరుపుతారు. కృష్ణ పక్ష చతుర్దశి మధ్యరాత్రి బయటకు చూడడానికి చీకటిగా కనిపించినా అంతరాత్మలో వుండే పరంజ్యోతిని స్ఫష్టంగా దర్శించే అంతర్ దృష్టి కి మంచి సందర్భం అనే తత్వాన్ని అర్ధం చేసుకోవాలి. మహాశివరాత్రి, మాస శివరాత్రి యీ తత్వార్ధాలకి ఆధారాలు. అమావాస్య రాత్రిని దీపాల పండుగగా జరుపుకునే భారత దేశవాసులమైన మనం కళ్ళుమూసుకున్నా ధ్యాన అంధకారంలో అంతరాత్మలోని కాంతులుని చూడగలం అనే తత్వాన్ని స్పష్టంగా తెలుప గలుగుతున్నాము. దేవతలను ఆవాహన చేయడానికి దీపాన్ని వెలిగించాలి అని మన పూర్వీకులు తెలుసుకున్న సత్యం. ఆవే మన ఇంటి ఆచారాలుగా మారాయి. ఉదయ సాయంకాలాలలో గృహాన్ని శుభ్రపరచి, దీపం వెలిగించడం లక్ష్మీ కరం అనే విషయం మన దేశంలో అందరికీ తెలిసినదే. దేవునికి ముందు, తులసికోట ముందు, ముగ్గుల మధ్య గృహ ముఖ ద్వారానికి ముందు దీపాలు వెలిగించడం వలన దుష్ట శక్తులు చేరవు. శుభాలు కలుగుతాయనడానికి దీపమే నిదర్శనం. ఏదైనా ఒక సత్కార్యం సంకల్పించినపుడు దీపం వెలిగించి , ఆ దీపానికి (అగ్ని) కి ఒక ఫలాన్ని నివేదించి ప్రార్ధిస్తే ఆ కార్యం తప్పక నెరవేరుతుంది. ఇది మన సంప్రదాయం. గృహంలో సాయం సంధ్యలో వెలిగించిన దీపం మరునాడు ప్రొద్దుటి దాకా వెలుగుతూ వుంటే ఆ గృహంలో బీదరికం, దుష్ట శక్తులు, అమంగళాలు తొలగిపోతాయని శాస్త్ర వాక్యం. భర్తృహరి దీప జ్యోతిని శివలింగం గా, శివ రూపంగా వర్ణించారు. ' దీపాంకురా ' ని ముగ్గురు దేవీమూర్తులకు , ఆది దేవతగా రామకృష్ణ పరమహంస ధ్యానించారు. సద్గతులు పొందడానికి దీపంఒక హేతువు. మరణించినవారు నరకం వంటి చీకటి బావులకి ళ్ళకుండా , కాంతివంతమైన దివ్యలోకాలు చేరడానికి సద్గతులు కలగాలని ప్రార్ధిస్తూ దీపం పెట్టడం ఆచారం. కేరళ రాష్ట్రంలో వివాహాది శుభకార్యాలన్నింటికీ దీపమే ప్రధాన సాక్షి. అగ్నిహోత్ర విజ్ఞానమే దీపం వెలిగించడంలోని అంతరార్ధం. సంపూర్ణమైన, శుభకరమైన కార్యాల విజయాలకి , దీక్షా ఫలాలను పొందడానికి 'అఖండ దీపం' వెలిగించడమనే ఆచారం వున్నది. ఆగమ శాస్త్రంలో ఆశ్వీయుజ అమావాస్య కి మహారాణి అనే పేరు వున్నది. శక్తి పూజలకి పేరు పొందిన ఆశ్వీయుజ మాసం ఆరంభం, ముగింపు రెండూ శక్తి పూజామయం. నిండు రోజుగా చెప్పబడే అమావాస్య ని దీపాకాంతులతో నింపారు మన ప్రాచీనులు. ఐశ్వర్యానికి స్వాగతం తెలుపుతూ ' లోకైక దీపాంకురాం' అంటూ జగజ్జననిని పూజించే పండుగగా
దేశమంతటా పలు ప్రాంతాలలో ఏకమనస్కులై ఉత్సవం జరుపుకుంటున్నారు. కాంతిని ఐశ్వర్యంగా భావించి దీపాన్ని లక్ష్మీ దేవిగా పూజించే పండుగే ' లక్ష్మీ పండగ అని ' ధనపూజ' అని యీ పండుగ ప్రసిద్ధి చెందినది. ఈ పండుగ మరునాటి నుండి ఆరంభమయ్యే కార్తిక మాసమంతా దీపాలు వెలిగించే మాసం. జ్యోతిర్లింగ స్వరూపమైన పరమశివునికి జ్యోతి ప్రీతికరం.
దీపం జ్యోతి పరబ్రహ్మ