YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కోవిడ్ నిబంధనాల బాధ్యత కేంద్రానిదే

కోవిడ్ నిబంధనాల బాధ్యత కేంద్రానిదే

న్యూఢిల్లీ, నవంబర్ 28,
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల బెంచ్‌  సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించింది.  ‘‘కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలి. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. 30శాతం మంది గడ్డం కిందకి మాస్కుల్ని వేలాడదీస్తున్నారు.  గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఆంక్షల్ని  కఠినతరం చేయాలి’’ అని స్పష్టం చేసింది.దేశంలో 24 గంటల్లో 43,082 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788కి చేరుకుంది. ఒకే రోజు 492 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య లక్షా 35 వేల 715కి చేరుకుంది.  దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పది రాష్ట్రాల నుంచి 77% కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయంటూ ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు.  ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య బాగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలు చర్యలు తీసుకోకపోతే కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని  బెంచ్‌ స్పష్టం చేసింది.

Related Posts