హైదరాబాద్ నవంబర్ 28
నోవెల్ కరోనా వైరస్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ పురోగతి గురించి ప్రధాని మోదీ ఇవాళ సమీక్ష నిర్వహించారు. నగరంలోని జీనోమ్‌వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను ఆయన సందర్శించారు. అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత హకీంపేట్ చేరుకున్న మోదీ.. సుమారు గంట సేపు భారత్‌బయోటెక్ సంస్థలో గడిపారు. ఆ సంస్థ ఎండీ కృష్ణ ఎల్లాతో పాటు ఇతర శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ వ్యాక్సిన్ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. బయోసేఫ్టీ లెవల్ -3 సదుపాయాలు కలిగిన భారత్‌బయోటెక్ పనితీరును మోదీ సమీక్షించారు. వ్యాక్సిన్ పురోగతి గురించి శాస్త్రవేత్తలు మోదీకి తెలియజేశారు. ప్రస్తుతం కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. తిరుగుప్రయాణ సమయంలో బయోటెక్ సంస్థ వద్ద ప్రధాని మోదీ కాసేపు కాన్వాయ్ బయటకు వచ్చి మీడియాకు, జనాలకు అభివాదం చేశారు. అంతకుముందు డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం సోమేశ్ కుమార్.. ప్రధానికి స్వాగతం పలికారు. హకీంపేట నుంచి ప్రధాని మోదీ నేరుగా పుణె వెళ్తారు. అక్కడ ఆయన సీరం ఇన్స్‌టిట్యూట్‌ను సందర్శిస్తారు.