ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీని ఏప్రిల్ 7 నుంచి మే 27వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం వివరాలను వెల్లడించింది. ప్రారంభోత్సవం ఒక రోజు ముందుగా 6వ తేదీన నిర్వహించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపాడు. ఆరంభపోటీ, ఫైనల్ ముంబైలోనే నిర్వహించనున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ అభ్యర్థన మేరకు మ్యాచ్‌ల వేళల్లో మార్పులు చేశారు. రాత్రి 8కి ఆరంభమయ్యే మ్యాచ్‌లను ఓ గంట ముందుగా....అంటే 7 గంటలకు, సాయంత్రం 4 గంటల మ్యాచ్‌లు సాయంత్రం 5.30కు మొదలవుతాయు. వారాంతంలో రెండు మ్యాచ్‌లు ఉన్నరోజుల్లో రెండు మ్యాచ్‌లను వేర్వేరు చానళ్లలో ప్రసారం చేయనున్నట్టు స్టార్‌స్పోర్ట్స్ తెలిపింది. కాగా జనవరి 27, 28 తేదీలలో 360మంది భారత ఆటగాళ్లతోపాటు మొత్తం 578 ఆటగాళ్లను వేలం వేయనున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. కాగా కింగ్స్ పంజాబ్ జట్టు తమ ఏడు హోం మ్యాచ్‌ల్లో నాలుగు మొహాలీలో, మూడు ఇండోర్‌లో ఆడుతుంది. రాజస్థాన్ ఆడాల్సిన ఏడు హోం మ్యాచ్‌ల వేదికను ఈనెల 24న జరిగే కోర్టు విచారణ తర్వాత నిర్ణయిస్తారు.