అనంతపురం, నవంబర్ 30,
నందమూరి బాలకృష్ణకు ఎప్పుడూ రాజకీయాలంటే ఇష్టం లేదు. ఆయనకు సినిమాలంటేనే పిచ్చి ప్రేమ. అదే ప్రపంచం. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తంటాలు తెచ్చిపెట్టింది. బాలకృష్ణ గత కొద్దిరోజులుగా మౌనంగా ఉండటం పార్టీ కార్యకర్తలనే కాదు ఆయన అభిమానులను కూడా ఆందోళన కల్గిస్తుంది. బాలకృష్ణ సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న కామెంట్స్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. పార్టీ ఏపీలో మరింత బలోపేతం కావాలంటే బాలకృష్ణ ఒక చేయి వేయాల్సిందేనంటున్నాయి.నిజానికి బాలకృష్ణకు ఎప్పుడూ రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేదు. 1983లోనే బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీని విజయ పథాన నడిపించారు. అప్పుడు కూడా బాలకృష్ణ రాజకీయాలను పట్టించుకోలేదు. తండ్రి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఏనాడు బాలకృష్ణ జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైనా ఎన్నికలకు ప్రచారానికి వెళ్లడం తప్పించి బాలకృష్ణ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అసలు పోటీ కూడా చేయలేదు.అయితే రాష్ట్ర విభజన తర్వాత బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి వచ్చారనే చెప్పాలి.టీడీపీ కూడా అప్పట్లో అధికారంలోకి రావడంతో కొంత యాక్టివ్ గా కన్పించారు. చంద్రబాబు చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు హాజరై పార్టీ క్యాడర్ లో జోష్ నింపారు. 2014 నుంచి 2019 వరకూ ప్రభుత్వ వ్యవహారాల్లో బాలకృష్ణ జోక్యం లేదనే చెప్పాలి. తిరిగి 2019 ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు.బాలకృష్ణ కేవలం హిందూపురం రాజకీయాలకే పరిమితం అయ్యారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని, మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని లేఖలు రాస్తూ అప్పడప్పుడూ వార్తల్లోకి ఎక్కుతున్నారు తప్పించి ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. అధికార పార్టీతో పెట్టుకోవడం ఎందుకని ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. తన బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ లు పార్టీ కోసం కష్టపడుతున్నా బాలకృష్ణ మాత్రం పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది