YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండలి కొనసాగింపు దిశగా జగన్

మండలి కొనసాగింపు దిశగా జగన్

గుంటూరు, నవంబర్ 30, 
అందుకే అనుభవం అవసరం అని అంటారు ఎవరైనా. రాజకీయాల్లో ఆవేశం ఉండాలి. అనుభవం కూడా ఉండాలి. అపుడే బాలన్స్ ఉంటుంది. జగన్ కి గత ఏడాది చలి కాలంలో ఒక్కసారిగా వేడి ఆవేశం వచ్చింది. తాను అనుకున్న మూడు రాజధానుల బిల్లుకు తెలుగుదేశం అడ్డుపడి సెలెక్ట్ కమిటీ పేరిట కాలయాపనకు సిద్ధపడడం చూసి తట్టుకోలేకపోయిన యువ ముఖ్యమంత్రి మోకాలడ్డే ఈ శాసనమండలి మనకు అవసరమా అని నాటి అన్న గారి లెవెల్లో వీర‌ ఆవేశం ప్రదర్శించారు.ఆ వెంటనే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశం పెట్టి మరీ శాసనమండలిని నిందించారు. అది వ్యర్ధం అని కూడా అనేశారు. ఏటా అరవై కోట్ల రూపాయలు ఉత్త పుణ్యాన ఖర్చు చేస్తున్నామని కూడా జగన్ చెప్పుకొచ్చారు. పైగా రాజకీయ పునరావాసకేంద్రం అంటూ నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో విద్యావంతులు లేని నాడు మండలి అవసరం ఉందేమో కానీ ఇపుడు అలాంటిది లేదంటూ తన పార్టీలో ఉన్న చదువరులైన ఎమ్మెల్యేల చిట్టా కూడా చదివారు. మొత్తానికి జగన్ కి టీడీపీ మీద కోపం ఉంది, దాన్ని మండలి మీదకు మళ్ళించి కారాలూ మిరియాలూ కలిపి నూరేశారు.ఇక జగన్ ఆ మధ్యన ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారి మండలి రద్దు గురించి కేంద్రానికి గుర్తు చేసేవారు. అయితే రాష్ట్రం పంపిన తీర్మానాన్ని కేంద్రం భద్రంగా ఉంచింది కానీ క్యాబినేట్ మీటింగులో కూడా పెట్టి చర్చించలేదు. ఆ తరువాత రాజకీయాలు కూడా మారిపోయాయి. జూన్ లో మరోమారు అసెంబ్లీని పెట్టి మూడు రాజధానుల బిల్లు నెగ్గించుకున్న జగన్ కి ఆటోమేటిక్ గా మండలి మీద మంట కూడా పోయింది. పైగా కేంద్రం కూడా రద్దు విషయంలో ఏమీ మాట్లాడకపోవడం కలిసొచ్చింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు, పండుల రవీంద్ర బాబు, జకియా ఖానూం లకు వరసగా ఎమ్మెల్సీ పదవులు జగన్ ఇచ్చేశారు.ఇక జగన్ తాజాగా తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి చక్రవర్తికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంటే మండలిని కొనసాగించాలని జగన్ పూర్తిగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అంతే కాదు, గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ వంటి వారు జగన్ ద్వారా ఇప్పటికే హామీ పొంది ఉన్నారు. ఇలా రానున్న రోజులలో చాలా మందికి ఇక మీదట జగన్ మండలిలో పదవులు భర్తీ చేస్తారని అంటున్నారు. మొత్తానికి పునరావాస కేంద్రం అని తాను ఆరోపించినట్లుగానే జగన్ అదే బాటలో నడుస్తున్నారు అని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక మండలి విషయంలో జగన్ మడమ తిప్పేశాడు అని కూడా అంటున్నారు. ఎవరేమన్నా కూడా మండలి ఉంటే బోలెడు పదవులు వస్తాయని వైసీపీ నేతలు మాత్రం ఆనందిస్తున్నారుట.

Related Posts