YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఆన్ లైన్ లో బంగారం ...పంపించే అవకాశం

ఆన్ లైన్ లో బంగారం ...పంపించే అవకాశం

ముంబై, నవంబర్ 30, 
పండుగల సీజన్‌లో చాలామంది విలువైన బహుమతులతో తమ ఆప్తులను సంతోషపర్చాలని చూస్తుంటారు. ప్రస్తుత ఆన్‌లైన్‌ యుగంలో ఎంత దూరాన ఉన్నవారికైనా బహుమతులను పంపడం చాలా సులభమే. కానీ మన ఆప్తులకు, అందునా ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారాన్ని ఆన్‌లైన్‌లో బహుమతిగా పంపాలంటే? అందుకూ మార్గం లేకపోలేదు. సామాజిక మాధ్యమ దిగ్గజం ‘వాట్సాప్‌'.. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘సేఫ్‌గోల్డ్‌'తో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్‌ గోల్డ్‌ను కొనుగోలు చేసేందుకు లేదా అందులో పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుతం చాలా మార్గాలున్నాయి. అలాంటి వాటిలో ‘సేఫ్‌గోల్డ్‌' ఒకటి. బంగారాన్ని కొనుగోలుచేసి కూడబెట్టుకునేందుకే కాకుండా ఎలాంటి చీకూచింతా లేకుండా దాన్ని భద్రంగా దాచుకోవాలనుకునే కస్టమర్ల కోసం ‘గోల్డ్‌ ఎక్యుములేషన్‌ ప్లాన్‌'ను సేఫ్‌గోల్డ్‌ ఆఫర్‌ చేస్తున్నది. డిజిటల్‌ గోల్డ్‌ను అందజేసేందుకు పేటీఎం, ఫోన్‌పే లాంటి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌తో చేతులు కలిపిన సేఫ్‌గోల్డ్‌.. వాట్సాప్‌ వినియోగదారులు పూర్తి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని భౌతిక రూపంలో కొనుగోలు చేసేందుకు, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ పొందేందుకు వీలుకల్పిస్తున్నది. వాట్సాప్‌ వినియోగదారులు తొలుత తమ అకౌంట్‌కు లాగిన్‌ అయి కొంత బంగారాన్ని కొనాలి. అనంతరం డ్యాష్‌బోర్డులో గిఫ్ట్‌ ఆప్షన్‌ను క్లిక్‌చేసి బహుమతి గ్రహీత మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను, బహుమతిగా ఇవ్వదల్చుకున్న పుత్తడి పరిమాణాన్ని, వారికి పంపదల్చుకున్న సందేశాన్ని లేదా స్టిక్కర్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత గ్రహీతకు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌)తోపాటు సదరు బంగారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా రిడీమ్‌ చేసుకునేందుకు ఓ లింక్‌ను పంపుతారు. అనంతరం గ్రహీత తన సేఫ్‌గోల్డ్‌ అకౌంట్‌కు లాగిన్‌ అయి నిర్దేశిత టైమ్‌ పీరియడ్‌లోగా ఆ బంగారాన్ని క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బహుమతి పంపినవారే నేరుగా వాట్సాప్‌ లేదా మరే ఇతర మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారానైనా గ్రహీతకు లింక్‌ను పంపవచ్చు. దీంతో గ్రహీతకు ఆ బహుమతి చేరుతుంది. సేఫ్‌గోల్డ్‌లో ఖాతా లేనివారికి కూడా పుత్తడిని బహుమతిగా పంపేందుకు ఆ ప్లాట్‌ఫామ్‌ వీలుకల్పిస్తున్నది. ఇందుకోసం గ్రహీత తనకు బహుమతిని పంపినవారి మొబైల్‌ నంబర్‌తోపాటు బహుమతిగా వచ్చిన బంగారాన్ని క్లెయిమ్‌ చేసుకునేందుకు పంపిన వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ను (ఓటీపీని) ఎంటర్‌చేస్తే సరిపోతుంది.

Related Posts