న్యూఢిల్లీ, నవంబర్ 30,
భారత మ్యాప్ లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడక్కడ కొన్ని చోట్ల కన్పిస్తున్నా అక్కడ కూడా అది కూడా ఎంతో కాలం కాంగ్రెస్ ఉండదనే అనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థిితి దారుణంగా తయారయింది. సరైన నాయకత్వం లేకపోవడం, ఆ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేకపోవడమే ఈ దుస్థితికి కారణమని చెప్పక తప్పదు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సయితం కాంగ్రెస్ ను అంటరాని పార్టీగానే చూస్తున్నాయి. దాన్ని పట్టుకుంటే తాము భస్మం అవకతప్పదని ప్రాంతీయ పార్టీలు భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది.కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తుంది. ఏడేళ్ల ముందు ఒక వెలుగు వెలిగిన పార్టీ. ఎందరు నేతలు. ఎన్ని సీట్లు. కానీ 2014 నుంచి కాంగ్రెస్ ఫేట్ మారింది. బీజేపీ మరీ మోదీ, అమిత్ షాల నాయకత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. దీనికి తోడు రాహుల్ గాంధీ అపరిపక్వత విధానాలు ఆ పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. ఆయన సీరియస్ పొలిటీషయన్ కాదన్న ముద్ర ప్రజల్లో ముద్రపడిందిఏఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టమంటే దాదాపు ఏడాదిన్నర నుంచి నానుస్తూ వస్తున్నారు. వేరే వారికి అప్పగించరు. అలా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగుతారు. అధిష్టానాన్ని ప్రశ్నించకూడదు. వారు చెప్పినట్లే నడుచుకోవాలి. సీనియర్ నేతల సలహాలు తీసుకోరు. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అంతా రాహుల్ గాంధీయే పార్టీ నిర్వహణను చూసుకుంటున్నారు. కానీ అనధికారికంగా మాత్రమే.కాంగ్రెస్ పార్టీ రాను రాను ఓటింగ్ శాతాన్ని కోల్పోతుండటం ఆ పార్టీ నేతలను ఆందోళనలో పడేస్తుంది. బీహార్ లో 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని 9.48 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. ఇక్కడ ఎంఐఎంకు 12.4 శాతం ఓట్లు వచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా తగ్గిపోతుంది. రానున్న బీహార్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే ఇక కాంగ్రెస్ దుకాణం మూసివేయక తప్పదు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ యాక్టివ్ అయితేనే పార్టీ కొంతమేరకైనా బతికి బట్టకడుతుందంటున్నారు.