న్యూఢిల్లీ, డిసెంబర్ 1
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు. ఇక వేరే గత్యంతరం లేెకపోవడంతో ఆయన అయిష్టంగానే అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏఐసీసీ సమావేశం ఏర్పాటు చేసి అందులో రాహుల్ గాంధీ నాయకత్వంపై స్పష్టత ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల పార్టీ శాఖలకు పార్టీ నేత మధుసూధన్ మిస్త్రీ లేఖ రాయడం ఇందుకు నిదర్శనం.2019 పార్లమెంటు ఎన్నికలలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పదవికి దూరంగా ఉన్నారు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం లేదు. ఈ ప్రభావం బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ ఉప ఎన్నికలపై కూడా పడ్డాయనే చెప్పాలి.అయితే గాంధీ కుటుంబం తప్ప కాంగ్రెస్ పార్టీకి వేరే దారిలేదు. తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ వేరొకరు బాధ్యతలను చేపట్టాలని కోరారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. గాంధీ కుటుంబాన్ని కాదని ఆ పదవిని చేపట్టినా ప్రయోజనం లేదని భావించి ఎవరూ పదవిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే సీనియర్ నేతలు మాత్రం పార్టీకి పూర్తికాలం నాయకత్వం కావాలని గట్టిగా కోరుతున్నారు.ఎన్నికలలో ఓటమి అలవాటయిన కాంగ్రెస్ పార్టీకి రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకోవాలంటే పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా కొంత దిగివచ్చినట్లే కనపడుతుంది. ఇంకా బెట్టు చేస్తూ పోతే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు అంగీకరించారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద మళ్లీ రాహుల్ అధ్యక్ష పదవి చేపడితే కొంతలో కొంతైనా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.