విజయవాడ, డిసెంబర్ 1,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు జగన్ సర్కారు మరోసారి ఊహించని షాకిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎస్‌ఈసీ ప్రకటనపై.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు.ఎస్ఈసీ ప్రకటన సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని పిటిషన్‌లో పేర్కొంది. కరోనా బారిన పడి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది పైగా మరణించారని ప్రభుత్వం గుర్తు చేసింది. గతంలో కరోనా వ్యాప్తి చెందుతోందంటూ ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్..ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది.కాగా, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ పలుమార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.