తిరుపతి, డిసెంబర్ 2,
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయడానికి కారణాలేంటి? తనకు బలం ఉదని విశ్వసిస్తుందా? తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ జనసేన బలంగా లేదు. బీజేపీ పరిస్థితి కూడా అంతే. అయితే పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీకి ఎందుకు సుముఖత చూపుతున్నారన్న చర్చ జరుగుతోంది. నిజానికి పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తొలుత పెద్దగా సీరియస్ గా లేరు.తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం చూసిన తర్వాతనే పవన్ కల్యాణ్ కు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన వచ్చిందంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన మద్దతిచ్చిన ఎంపీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి కేటాయించారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కేవలం పదహారు వేల ఓట్లు సాధిస్తే, జనసేన అభ్యర్థి అప్పుడు పోటీ చేయలేదు. అయితే ఇది ఒక్కటే కాదు. జనసేన పార్టీ క్యాడర్ లో జోష్ నింపాలంటే పోటీకి దిగడమే బెటర్ అని పవన్ కల్యాణ్ భావించడమే. గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలో గెలిచిన జనసేన పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తాయి. అందుకే సాధారణ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమాయానికి ముందే బీజేపీతో చేతులు కలిపారు. ఇది ఎవరూ ఊహించని విషయమే. కానీ పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి అధికారంలోకి రావాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారంటారు. అయితే బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యాక ఆ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకు వెళుతోంది. పార్టీ బలోపేతం అయిందా? లేదా? అన్నది పక్కన పెడితే నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. కానీ పవన్ కల్యాణ‌్ మాత్రం ఇప్పటి వరకూ జనసేనను బలోపేతం చేసే చర్యలు ప్రారంభించలేదు. ఇటీవలే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరో నాలుగైదు నెలల్లో తన సినిమా షూటింగ్ లు పూర్తి చేసుకుని ప్రజల్లోకి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకు తిరుపతి ఉప ఎన్నిక సరైన వేదిక అని ఆయన భావిస్తున్నారు. తమ అభ్యర్థి బరిలో ఉంటే లోపాయికారీగా టీడీపీ కూడా మద్దతిచ్చే అవకాశముండటం కూడా పవన్ పట్టుబట్టడానికి కారణం అని అంటున్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి పవన్ కల్యాణ‌్ పట్టుదలగా ఉన్నట్లే కన్పిస్తుంది.