YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా తగ్గిన పన్నేతర ఆదాయం

భారీగా తగ్గిన పన్నేతర ఆదాయం

హైదరాబాద్, డిసెంబర్ 2,
గతేడాది ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత కరోనా, ఫలితంగా విధించిన లాక్‌డౌన్‌... వెరసి రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ స్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండో త్రైమాసికం (సెప్టెంబరు) నాటికి అందుబాటులో ఉన్న లెక్కలు ఇవే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పన్నేతర ఆదాయం (నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ)లో భారీ తగ్గుదల కనిపించింది. ఆ నెలాఖరుకు ఈ రూపంలో రూ.1,542 కోట్లు మాత్రమే సమకూరాయి. పన్నేతర ఆదాయానికి సంబంధించి సర్కారు వేసుకున్న మొత్తం అంచనా(రూ.30,600 కోట్లు)ల్లో ఇది 5.04 శాతంగా నమోదు కావటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఇది 13.89 శాతంగా నమోదైంది. మరోవైపు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఆ మేరకే అక్కడి నుంచి నిధులు విడుదలవుతు న్నాయి. ఈ క్రమంలో రెండో త్రైమాసికం నాటికి (సెప్టెంబరు) రూ.3,753 కోట్లు మాత్రమే మనకు దక్కాయి. గతేదాది రాష్ట్రవాటాకు 37.51 శాతం నిధులు రాగా... ఈసారి 34.41 శాతం మాత్రమే వచ్చాయి. భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలనుకున్న సర్కారు ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. దీంతో సెప్టెంబరు నాటికి కేవలం 0.22 కోట్లను మాత్రమే సర్కారు ఆర్జించగలిగింది. దీంతోపాటు అమ్మకపు పన్నులో కూడా ఆశనిపాతమే మిగిలింది. ఇందుకు సంబంధించి మొత్తం బడ్జెట్‌లో రూ.26,400 కోట్లను సర్కారు అంచనా వేసుకోగా... సెప్టెంబరు చివరి నాటికి రూ.8,148 కోట్లే ఖజానాకు చేరాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి ఇది 12 శాతం మేర తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఇతర సహాయాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఈ రూపంలో రూ.4,649 కోట్లే రావటం గమనార్హం. ఇదే సమయంలో అప్పుల్లో మాత్రం ప్రభుత్వం తాను వేసుకున్న అంచనాలకు చాలా దగ్గరగా వెళ్లింది. మొత్తం రూ.33,191 కోట్ల రుణాలను స్వీకరించాలని సర్కారు భావించగా... అందులో సెప్టెంబరు నాటికే రూ.25,989 కోట్ల అప్పులను తేవటం గమనార్హం. 

Related Posts