విజయవాడ, డిసెంబర్ 3,
రాష్ట్రంలో వైసీపీ నాయకులు కట్టు తప్పుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. తరచుగా ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విషయాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సహనం కోల్పోయి.. సొంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలు సంధిస్తున్నారు. విరుచుకుపడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరి ఇదంతా చూస్తూ జగన్ ఎందుకు ఊరుకుంటున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ,కొందరు మాత్రం ఈ విషయాలన్నీ జగన్ పట్టించుకోరని.. ఆయనకు తీరిక లేదని చెప్పే ప్రయత్నాలు చేసేవారు కూడా ఉన్నారు. కానీ, వాస్తవం అది కాదని అంటున్నారు వైసీపీ నాయకులు.కొన్నాళ్ల కిందట చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డితో పరుషంగా మాట్లాడారు. విశాఖలో అవినీతి జరుగుతోందని.. ఆ అవినీతి చేసేవారిలో ఇక్కడ నేతలు ఉన్నారని నర్మగర్భంగా సాయిరెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు ధర్మశ్రీ.. ఎవరో పేర్లు చెప్పాలని.. లేకుంటే కామెంట్లు మానుకోవాలని గట్టిగానే చెప్పారు. ఇది వివాదానికి దారితీసింది దీంతో నేరుగా అందరినీ జగన్ తాడేపల్లికి పిలిపించి.. పంచాయతీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. సాయిరెడ్డితోనూ జగన్ స్వయంగా మాట్లాడారు. అయితే.. ఈ సమావేశంలో జగన్ ఏం చెప్పారు. పార్టీ నేతలకు ఏం హితవు పలికారు ? అనేది సస్పెన్స్‌గా మారింది.అయితే… తాజాగా సాయిరెడ్డి మరోసారి విశాఖ నగర నాయకులు, ఎమ్మెల్యేలతో ప్రైవేటుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాయి రెడ్డి చేసిన కామెంట్లు.. కొందరు నాయకులు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా లీక్ చేయడం గమనార్హం. దీనిని బట్టి.. “జగన్ మన పార్టీ వాళ్లందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదు. చేయరు కూడా. మీరే ప్రజలతో మమేకం కావాలి. ఏం కావాలో ప్రభుత్వాన్ని అడగండి. మీ ర్యాంకును మీరే పెంచుకోండి. ప్రజల్లో మీరు మైనస్ అవుతున్నట్టు కనిపిస్తే ప్రభుత్వానికి నివేదికలు అందితే.. మీప్లేస్‌లు మారిపోయి.. కొత్తవారికి ఛాన్స్‌లు ఇస్తారు. ఇదే జగన్ నిర్ణయం“ అని సాయిరెడ్డి కుండబద్దలు కొట్టారట.అంటే ఇప్పటి వరకు నాయకులు కొట్టుకుంటున్నా.. తిట్టుకుంటున్నా జగన్ చూస్తూ.. ఊరుకుంటున్నారంటే.. దీనివెనుక ఇంత వ్యూహం ఉందా ? అని నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అదే సమయంలో చాలా మంది మంత్రులపై అనేకానేక ఆరోపణలు వస్తున్నా జగన్ చూస్తూ ఊరుకోవడం వెనక కూడా మరో 9 నెలల్లో వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయాలని డిసైడ్ అవ్వడమే కారణం అంటున్నారు. ఏదేమైనా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నా తమను ఎవ్వరూ అడిగేవారే లేరనుకుంటున్నా జగన్ వారిని తెరవెనక ఓ కంట కనిపెడుతూనే ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ఎంత గొప్ప నేతకైనా జగన్ దగ్గర మార్కులు తగ్గితే సరైన టైంలో చీటు చిరిగిపోవడం పక్కా.