YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈ గణేశుడు పెళ్ళిళ్ళు నిర్ణయిస్తాడు!

ఈ గణేశుడు పెళ్ళిళ్ళు నిర్ణయిస్తాడు!

ఏ గుళ్లో అయినా వినాయకుడు ఎక్కువగా కనిపించేది నాలుగు చేతులతోనే కానీ... ఇడగుంజిలోని ఆలయంలో మాత్రం స్వామి రెండు చేతులతోనే దర్శనమిస్తాడు. విఘ్నాలను తొలగించే గణపతిని ఇక్కడ పెళ్ళిళ్లు ఖాయం చేసే స్వామిగా కొలుస్తారు. వినాయకుడే కోరి వెలసిన ఈ క్షేత్రం ఉత్తర కర్ణాటకలోని హెన్నావరలో ఉంది. ఏకదంతంతో, నాలుగు చేతులతో, ఎలుక వాహనంతో దర్శనమిచ్చే గణపతి... ఇడగుంజిలో మాత్రం అవేవీ లేకుండానే భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామి ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో నిల్చుని దర్శనమివ్వడం విశేషం. అలాగే స్వామికి ఎలుక వాహనం కూడా ఉండదు. వినాయకుడు ఇక్కడ రెండు దంతాలతో కనిపిస్తాడు. అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం ఉత్తర కన్నడ జిల్లా హెన్నావర సమీపంలో, ఇడగుంజిలో శరావతి నది, అరేబియా సముద్రంలో కలిసే చోట ఉంది. ఈ గుడిని పదిహేనువందల ఏళ్ల క్రితం కట్టారని అంటారు. ఇక్కడ స్వామికి పెళ్ళిళ్ళు ఖాయం చేసే వినాయకుడని పేరు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామి అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే చేయరని అంటారు. కొందరయితే.... ఏదయినా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే వధూవరులిద్దరి తరఫువారూ ఇక్కడకు వచ్చి స్వామి పాదాల చెంత రెండు చీటీలను ఉంచుతారు. కుడిపాదం దగ్గరున్న చీటీ కింద పడితే దాన్ని అంగీకారంగా భావిస్తారు. లేదంటే రెండో ఆలోచన లేకుండా మరో సంబంధాన్ని వెతుక్కుంటారు. దేశం నలుమూలల నుంచి ఏటా ఇక్కడకు పదిలక్షల మంది వస్తుంటారని అంటారు. ఈ ఆలయంలో స్వామికి గరిక సమర్పించి... ఏదయినా కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. విశ్వకర్మ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వామే ఇక్కడకు వచ్చి కొలువయ్యాడనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
స్థలపురాణం ద్వాపర యుగం అంతమై, కృష్ణావతారం పూర్తయ్యే సమయంలో... కలియుగ ఆరంభం గురించి అందరూ భయపడ్డారట. కలియుగ ఆరంభంలో ఎవరికీ ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా ఉండేందుకు వలఖిల్య రుషి ఆధ్వర్యంలో కొందరు రుషులు కలిసి యాగాలు చేయడానికి సిద్ధమయ్యారట. దాంతో శరావతి నది ఒడ్డున యజ్ఞాలు మొదలు పెడితే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయట. రుషులు చివరకు నారదుడి సాయం కోరితే వినాయకుడిని పూజిస్తే ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయని సలహా ఇచ్చాడట. అలా నారదుడి సలహాతో రుషులు వినాయకపూజను ప్రారంభించారు. ఆ సమయంలో త్రిమూర్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించారనీ వాళ్లే స్వయంగా ఇక్కడ చక్రతీర్థ, బ్రహ్మతీర్థ పేరుతో కొలనులు ఏర్పాటుచేశారనీ అంటారు. ఆ తరువాత నారదుడూ, రుషులూ కలిసి దేవతీర్థ పేరుతో మరో కొలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారట. చివరకు నారదుడు పార్వతీదేవికి ఈ యాగం గురించి తెలియజేసి గణపతిని పంపమని అడిగాడట. అలా పార్వతి | అనుమతితో ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డుతో వచ్చిన వినాయకుడు యాగానికి సంతోషించి విఘ్నాలన్నీ తొలగించాడట. దాంతో అది విజయవంతంగా ముగిసిందట. గణపతికి ఈ ప్రాంతం నచ్చడంతో భక్తుల కోర్కెలు తీరుస్తూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుని ఉండిపోయాడట. ఆ తరువాతే విశ్వకర్మ స్వామి విగ్రహాన్ని స్థాపించాడనీ ... తరువాత ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయాన్ని కట్టించారనీ చెబుతారు. ప్రత్యేక ప్రసాదం ఇక్కడ కేవలం పెళ్ళిళ్ళకు మాత్రమే కాదు.. కొందరు భక్తులు ఏ శుభకార్యం తలపెట్టినా, ఇల్లు కట్టాలన్నా, వాహనం కొనుక్కోవాలన్నా, ఉద్యోగంలో చేరాలన్నా స్వామి అనుమతి తీసుకుంటారట. ఇక్కడ రోజువారీ చేసే పూజలూ, నైవేద్యాలతోపాటూ పంచఖాద్య పేరుతో ప్రత్యేకంగా ప్రసాదం చేసి స్వామికి నివేదిస్తారు. వినాయక చవితితోపాటూ ఇతర పర్వదినాలనూ పురస్కరించుకుని స్వామికి ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. ఎలా చేరుకోవచ్చు విమానంలో రావాలనుకునేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి.. అక్కడినుంచి బస్సు, క్యాబ్స్ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైల్లో వచ్చేవారు మంకీ రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఏడు, ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి ఆటోలూ లేదా బస్సులో వెల్గొచ్చు. పలు ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

Related Posts