YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బుద్ధిమంతులు

బుద్ధిమంతులు

ఒక తల్లి ఓ విద్యావేత్త వద్దకు వెళ్ళింది. తన బిడ్డకు అక్షరాభ్యాసం ఎప్పుడు చెయ్యాలి అని అడిగింది. అతడు ‘బిడ్డ వయస్సెంత?’ అని ప్రశ్నించాడు. ఆ తల్లి సమాధానమిస్తూ ‘ఇంకా మూడేళ్లే!’ అంది. అయ్యో మూడేళ్లా? ఇంకా చదవడం ప్రారంభించలేదా! వెళ్ళు. ఇంటికి వెళ్ళి ప్రారంభించు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి’ అన్నారా విద్యావేత్త. పిల్లల బడి ఇంటితో ప్రారంభమవుతుందని, పెద్దల నడవడిక పిల్లలకు అనుకరణగా మారుతుందని పెద్దలు చెబుతారు. మూడేళ్ల బుద్ధి నూరేళ్లదాకా అని అనుభవజ్ఞుల మాట. మనిషి సన్మార్గంలో నడవాలంటే విద్య, జ్ఞానం రెండూ కావాలి. మనిషి నడవడికకు, వినయ విధేయతలకు, ఆచార వ్యవహారాలకు... ఇవే కారణాలు. ఈ మంచి లక్షణాలున్న వారే బుద్ధిమంతులు. రామాయణ మహాకావ్యం అయోధ్యకాండలో శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని వాల్మీకి మహర్షి ఆవిష్కరిస్తూ ‘శ్రీరాముడు చక్కని బుద్ధికలవాడు, మధురమైన వాక్కులు కలవాడు, తాను ఎంత బలవంతుడైనా...ఏమాత్రం బలగర్వంలేని వినయశీలి’ అని ప్రస్తుతిస్తాడు. ఆంజనేయుడి బుద్ధికుశలత అతడి నడతలో ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటుంది. సముద్ర లంఘనం, సీతాన్వేషణ, సీతా సందర్శన, రాక్షస సంహార సమయాల్లో తన బుద్ధిచాతుర్యాన్ని ప్రదర్శించిన నిష్కామ కర్మయోగి ఆంజనేయుడు. మహాభారతంలో ధర్మరాజంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. నమ్ముకున్న విలువల విషయంలోనే కాదు, తనను నమ్ముకున్న వ్యక్తుల విషయంలోనూ ధర్మరాజు ధర్మనిరతిని తప్పనివాడు. అందుకే యక్షుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, చనిపోయిన తమ్ముళ్లలో ఎవరి ప్రాణాలు కావాలో కోరుకొమ్మంటే ఏమన్నాడు? కుంతీ కుమారుల్లో తాను మిగిలి ఉన్నందువల్ల, పినతల్లి మాద్రి కుమారుల్లో పెద్దవాడైన నకులుణ్ని బతికించమని ధర్మరాజు యక్షుణ్ని ప్రార్థించాడు. ధర్మరాజు ధర్మబుద్ధికి సంతోషించిన యక్షుడు ఆ నలుగురినీ బతికించాడు. ఇటువంటి మరో అద్భుతమైన సంస్కారవంతమైన పాత్ర చిత్రణ మహాభాగవతంలో ప్రహ్లాదచరిత్రలో కనిపిస్తుంది. నారదుడు ధర్మరాజుకు ప్రహ్లాదచరిత్ర చెబుతూ ‘హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు సర్వగుణ సమన్వితుడు. దీనులను తల్లిదండ్రుల్లా భావించి ఆదరించేవాడు. గురువులను దైవసమానులుగా భావించేవాడు. పెద్దలు ఎదురైతే సేవకుడి మాదిరిగా వినయంతో నమస్కరించేవాడు. పరిహాసానికైనా ఎప్పుడూ అసత్యమాడనివాడు’ అని సంస్కార లక్షణాలను వివరిస్తాడు. మనిషిని మంచిమార్గంలో నడిపించే బుద్ధి మహత్తరమైనది. ఈ బుద్ధి సహాయంతోనే మనిషి జీవనరంగంలో ఉన్నతస్థానాన్ని చేరుకుంటాడు. బుద్ధి నశిస్తే మనిషికి సమస్తం నశిస్తుంది. సమస్త రోగాలకు మూలకారణం బుద్ధి నాశనమే. మంచి బుద్ధి మనిషిని ఆశయ శిఖరాలకు చేర్చుతుంది. సూర్యకిరణ స్పర్శతో కమలం వికసించినట్లుగా బుద్ధివికాసం పొందిన మనిషి ఆదర్శ పురుషుడై సమాజ అభ్యుదయానికి తోడ్పడతాడు. ఆ పరమాత్ముడి కృపను పొందుతాడు. 

Related Posts