పరమేశ్వరుని కుమారుడు , దేవలోక సైన్యాధిపతి అయిన కుమారస్వామికి పదహారు రూపాలు. అందులో ఏడవ రూపం కార్తికేయుడు. కుమారతంత్రం అనే గ్రంధంలో ఆరు ముఖాలు,ఆరు భుజాలు కలవాడు కార్తికేయుడు అని, ఎడమ ప్రక్క చేతులలో , బరిసె, డాలు మొదలైన ఆయుధాలు వరదముద్ర ధరించి వుంటాడు. కుడి ప్రక్కన చేతులలో శూలం, కత్తి ధరించి అభయముద్ర కలిగివుంటాడని తెలుపుతున్నది. కుమారస్వామి ఎటువంటి వ్యాధులనైనా గుణపరిచి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాడని యీ గ్రంధం తెలియ చేస్తున్నది. శ్రీ తత్వనిధి అనే గ్రంధంలో, ఒక ముఖం, మూడునేత్రాలు , పది హస్తాలు కలిగిన వాడని కుడి ప్రక్క చేతులలో , శూలం, చక్రం, శక్తి ,అంకుశం మొదలైన ఆయుధాలు అభయ ముద్ర ధరించి, ఎడమ ప్రక్కన హస్తాలలో తోమరమ్, పాశం , శంఖం మొదలైనవి ధరించి అభయముద్ర తో దర్శనమిస్తాడని వివరించబడింది. ఉదయ సూర్యుని వంటి దేహఛ్ఛాయ కలవాడు. శిరస్సున బిల్వమాల ధరించి వుంటాడు. మయూర వాహానా రూఢుడై వుంటాడని యీ గ్రంధం వివరించింది. రోగానికి, పీడ కి బేధం వున్నది. ముందుగా రోగ చిహ్నాలు కనిపిస్తూ, కొద్ది రోజులలొ తగ్గిపోయేది రోగం. వచ్చిన తరువాత ఎంతకాలమైనా గుణమవక వదలకుండా పీడించేదానిని పీడ అంటారు. మనిషికి పీడలు అనేకం. ఈ పీడలని , రోగాలని గుణపరిచే స్వామిగా తణిగై పురాణం చెప్తున్నది. కుమార తంత్రం లో కుమారస్వామి అనుగ్రహంతో జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నది. తనని భక్తి శ్రధ్ధలతో ఆరాధించే భక్తులకు సర్వ సౌభాగ్యాలు కలిగించే స్వామి. కృత్తికా నక్షత్రం నాడు కుమారస్వామిని పూజించడం సకల సౌభాగ్యాలు కలుగచేస్తుంది. కార్తిక మాసంలో ఈ స్వామిని స్తుతించిన ప్రత్యేక శుభ ఫలితాలు కలుగుతాయి.కుంభకోణంలోని కుంభేశ్వరుని ఆలయంలోను, తారాసురం లో వున్న ఐరావతేశ్వరుని ఆలయంలో కార్తికేయుని దివ్య దర్శనం లభిస్తుంది. కుమారస్వామి బ్రహ్మచారి మహారాష్ట్ర లోని పూనా నగరానికి సమీపాన " పార్వతి గిరి" అనే కొండ ఒకటి వుంది. ఈ గుహాలయంలో " కార్తికేయుడు " అనే పేరుతో కుమారస్వామి దర్శనమిస్తున్నాడు. ఆరు ముఖాలతో, మయూర వాహనం మీద ఆశీనుడై దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఈ విగ్రహం పాలరాయితో చేయబడినది. ఈ షణ్ముఖుడు బ్రహ్మచారి అని ఐహీకం.