YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

సూర్య నమస్కారాలు - ఫలితాలు

సూర్య నమస్కారాలు - ఫలితాలు

- సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత

-12 రకాల ఆసనాలు ఉంటాయి.
సూర్య నమస్కారాలు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. నిజానికి సూర్యనమస్కారాలు బ్రహ్మమూహూర్తంలోనే చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడు. 

శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నం, హరికేశం, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మానవ శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.

సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ వ్యాదులు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు లెక్క. వీటిలో 1 నుంచి 5… 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఆసనానికో ప్రయోజనం ఉంటుంది. 

ఏ ఆసనంతో ఎలాంటి ఫలితం..
1, 12:  ఈ ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాస కోశ వ్యవస్థ మెరుగవుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

2, 11:  ఈ ఆసనాలతో జీర్ణ వ్యవస్థను మెరుగవుతుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

3, 10:  ఈ ఆసనాలు రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి. 

4, 9:  ఈ ఆసనాలు వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

5, 8: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

6వ ఆసనం: మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

7వ ఆసనం: జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపయోగపడుతుంది.

ఫలితాలెన్నో..
సూర్య నమస్కారాలతో ఎన్నో ఫలితాలు ఉన్నాయి. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు… సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

అయితే సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమలతో కండరాలకు మంచి జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. గాఢంగా గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

Related Posts