గ్లోబల్ ఇంటర్నేషనల్ పాఠశాల నిర్వాకం
బాలల హక్కుల సంఘానికి పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు
ఫీజులు కట్టలేదని కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు జాతీయ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపిన వివరాల మేరకు ఫీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలో మహేష్ 4వ తరగతి, అనూష 6వ తరగతి చదువుతున్నారు. ఫీజులు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం మూడు రోజులుగా పిల్లలను తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పిల్లల తండ్రి రమేష్, పాఠశాల యాజమాన్యంపై బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. రమేష్ ఫిర్యాదు మేరకు బాలల హక్కుల సంఘం జాతీయ గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు సోమవారం పాఠశాలను సందర్శించి పిల్లల ఫీజు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు పిల్లల ఫీజు కింద రూ.4లక్షలను రమేష్ పాఠశాలకు చెల్లించారని పాఠశాల బస్సుకు చెల్లించాల్సిన రూ.20 వేల ఫీజు మాత్రమే ఉందని, దాని కోసమే పిల్లలను లైబ్రరీలో బంధించి వేధించారని ఆయన మండిపడ్డారు. నాలుగు లక్షల ఫీజు వసూలు చేసిన పాఠశాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లలను మానసికంగా వేధించిన గ్లోబల్ స్కూల్ యాజమాన్యంపై ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పిల్లల అక్రమ నిర్బంధం, పరిరక్షణ, విద్యా హక్కుకు భంగపాటు, పిల్లల పట్ల క్రూరత్వం తదితర చట్టాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.