ముంబై డిసెంబర్ 4
ఆర్థిక నిపుణుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలను ఒకింత సానుకూలంగా సవరించింది. ఇదే సమయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పందించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విస్తరణకు ముందు వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నామని, బ్యాంకు అందుకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఐటీ వ్యవస్థకు సంబంధించి ఆర్‌బీఐకి కొన్ని ఆందోళనలున్నాయని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. మొత్తం మీద బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, ఇతర రుణదాతలు ఖాతాదారులు/ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఐటీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థికసంస్థలన్నీ కూడా బలమైన ఐటీ పరిష్కారాలపై మరింత దృష్టి సారించి, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిజిటల్ వ్యవస్థలో అంతరాయాన్ని కూడా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
లావాదేవీల ‘పరిమితి’ పెంపు...
ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వాడకానికి మరింతగా ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితిని రూ. 2 వేల నుండి రూ. 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయన్నారు.వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాలను నిలుపుకోవాలని శక్తికాంతదాస్ సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తోన్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్నారు.
కీలక వడ్డీ రేట్లు యధాతథం...
వరుసగా మూడోసారి కూడా కీలక వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయలేదు. ద్రవ్యోల్భణం పెరగడం, జీడీపీ ప్రతికూలంగానే ఉండటం వంటి వివిధ కారణాల నేపధ్యంలో రెపో రేటును యథాతథం(నాలుగు శాతం)గా ఉంచింది. ఇక రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. బ్యాంకు రేటు 4.25 శాతంగా కొనసాగనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఎంపీసీ మూడు రోజులపాటు సమావేశమైంది. ఇందులో భాగంగా ‘విధానాన్ని యధాతథంగా అమలు’ చేసేందుకే కట్టుబడుతున్నట్లు విస్పష్టంగా ప్రకటించింది. దీంతో రెపో రేటు నాలుగు శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనున్నాయి.