విజయవాడ, డిసెంబర్ 5,
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తరచూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తాను పదవీ విరమణ చేసేలోగా ఎన్నికలను నిర్వహించాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. అందుకే తరచూ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే ఆ నెపాన్ని సర్కార్ పై నెట్టే ప్రయత్నంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అవసరం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టలేదు. సెకండ్ వేవ్ ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చిరికలు ఒకవైపు విన్పిస్తూనే ఉన్నాయి. మరోవైపు తరచూ వరదలు, తుపానులతో ఆంధ్రప్రదేశ్ విలవిలలాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎంతవరకూ సమంజమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు కొత్తగా షెడ్యూల్ ను ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్ర్రక్రియను పూర్తిగా రద్దు చేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రధాన ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. ఏకగ్రీవాలు ఏకపక్షంగా జరిగాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించడమే ఇందుకు కారణం.దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చుంది. నిమ్మగడ్డ మాత్రం ఈ రెండు నెలలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా గేమ్ ప్లాన్ చేశారంటున్నారు. తరచూ ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా తనపై సానుభూతిని పెంచుకుని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టార్ట్ చేసిన గేమ్ లో విన్నర్ ఎవరో భవిష్యత్ లో తేల్చనుంది.