YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

నాగార్జునసాగర్ పై కమలం గురి

నాగార్జునసాగర్ పై కమలం గురి

టీఆర్ఎస్‌కు ఒక్కో స్థానంలో షాక్ ఇస్తూ పోతున్న బీజేపీ ఇప్పుడు నాగార్జునసాగర్ పై గురి పెట్టింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య… ఇటీవలే చనిపోయారు. దీంతో ఆరు నెలల్లో అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. బీజేపీ నాయకత్వం ఇప్పటికే చురుగ్గా నాగార్జునసాగర్‌పై కసరత్తు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే నాగార్జున సాగర్‌లో బీజేపీ ఓటు బ్యాంక్ రెండు వేల ఓట్లు మాత్రమే. అక్కడ ఏ గ్రామంలోనూ బీజేపీకి పట్టులేదు. అక్కడ గెలవాలంటే… కాంగ్రెస్ పార్టీ నేతల్ని చేర్చుకోవడమే కీలకం. ప్రస్తుతం దశాబ్దాల పాటు .. కాంగ్రెస్ లో ఉండి.. రాజకీయ ఉత్థానాన్ని చూసిన నేతలు… ఆ పార్టీలో ఉండటానికి ఉక్కపోతగా భావిస్తున్నారు కాబట్టి.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ నేతల్ని కూడా బీజేపీ గురి పెట్టింది. నాగార్జునసాగర్ లో జానారెడ్డి కాంగ్రెస్ తరపున పెద్ద లీడర్‌గా ఉన్నారు. అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. అది ఆయన కంచుకోట లాంటి నియోజకవర్గం . గత ఎన్నికల్లో తన కుమారుడికి నాగార్జున సాగర్ అప్పగించి తాను మిర్యాల గూడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ హైకమాండ్ ఒప్పుకోకపోవడంతో నాగార్జునసాగర్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు జానారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలుస్తానన్న నమ్మకంతో లేరు. అందుకే.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరపున కుమారుడ్ని నిలబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆయన ఆలోచనకు తగ్గట్లుగానే బీజేపీ నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. జానారెడ్డి ఆసక్తి చూపితే.. ఆయనను పార్టీలో చేర్చుకోవడం ఖాయమే. అయితే ఆసక్తి చూపకపోవడం అన్న ప్రశ్నే లేదని.. బీజేపీ ఎప్పుడు పిలిస్తే.. అప్పుడు చేరిపోవడానికి జానారెడ్డి రెడీగా ఉన్నారని టీ కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. ఎలా చూసినా… నాగార్జున సాగర్‌లో ఇంత కాలం తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు.. గడ్డు పరిస్థితి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ స్థానాన్ని బీజేపీ పొందినా ఆశ్చర్యం లేదు

Related Posts