YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

యడ్డీకి గవర్నర్ అవకాశం..?

యడ్డీకి గవర్నర్  అవకాశం..?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఆయనంతట ఆయనే గౌరవప్రదంగా తప్పుకునేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే ఆయనకు రాష్ట్రంలో విలువ లేకుండా చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. యడ్యూరప్ప మాత్రం పదవి నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని చెబుతున్నారు. తాను ఉండగా మరొకరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేరని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.యడ్యూరప్పకు ఇటీవల అధిష్టానం నుంచి గౌరమైన ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా వెళ్లాలని కేంద్ర నాయకత్వం కోరినట్లు చెబుతున్నారు. యడ్యూరప్ప ఇప్పటికే 78 వయసులో పడటంతో ఆయనను పదవి నుంచి తప్పించాలని కేంద్ర నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే యడ్యూరప్ప ను బలవంతంగా గద్దె నుంచి దించితే అది ప్రత్యర్థులకు అడ్వాంటేజీగా మారుతుందని అధిష్టానం యోచిస్తుంది.అందుకే పొమ్మనకుండా పొగబెట్టాలన్నది బీజేపీ కేంద్రనాయకత్వం యోచనగా ఉంది. ముఖ్యనేతలందరూ యడ్యూరప్పకు దూరంగా ఉంటున్నారు. కొద్ది మంది సన్నిహితులు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మినహా మరెవ్వరూ యడ్యూరప్పకు అండగా నిలిచే పరిస్థితి కన్పించడం లేదు. ఇటీవల యడ్యూరప్ప అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశానికి దాదాపు పది మంది మంత్రులు గైర్హాజరవ్వడం కూడా కావాలని జరిగిందేనంటున్నారు. యడ్యూరప్పను సైడ్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.అంతేకాకుండా లోక్ సభ సభ్యులతో జరిపిన సమావేశానికి కూడా సభ్యులు హాజరు కాలేదు. యడ్యూరప్పకు వాల్యూ లేకుండా చేస్తే ఆయనంతట ఆయనే తప్పుకుంటారన్నది అధిష్టానం ఆలోచన. ఇప్పటికే రాష‌్ట్ర స్థాయిలో యడ్యూరప్పను తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. మరో రెండున్నరేళ్లు అధికారంలో ఉండవచ్చని భావిస్తున్న యడ్యూరప్పకు అధిష్టానం నుంచి ఎప్పుడు ఎలాంటి వార్తను వినాల్సి వస్తుందో నన్న టెన్షన్ పట్టుకుంది. మొత్తం మీద యడ్యూరప్పను గౌరవంగానే తప్పించాలనుకుంటున్నారు. కానీ అది అప్ప విషయంలో సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts