YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీటి కోసం కోటి తిప్పలు

నీటి కోసం కోటి తిప్పలు

వేసవి విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ భూగర్భ జలాలపైనా పడుతోంది. ఫలితంగా గృహసముదాయాల్లోనే కాక వ్యవసాయక్షేత్రాల్లోని బోర్లూ వట్టిపోతున్నాయి. దీంతో తాగునీరు కోసం జనాలు అల్లాడిపోతున్న పరిస్థితులు అనేకచోట్ల కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. నీటి కోసం పలు ప్రాంతాల్లో కటకట నెలకొంది. నాగర్‌కర్నూల్‌ లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు కోసం నానాపాట్లు పడుతున్నారు. మంచినీటి పథకాలు ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నట్లు చెప్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పలు నీటి పథకాలు సమర్ధవంతంగా పనిచేయడంలేదు. ఇక నీటి సమస్యను నివారించేందుకు అధికార యంత్రాంగం ట్యాంకర్లతో నీరు సరఫరా చేపట్టాల్సి ఉంది. ఇదీ పూర్తిస్థాయిలో అమలుకావడంలేదు. ఫలితంగా జనాలు తాగునీటి కోసం అలమటించాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే కాదు ఉమ్మడి పాలమూరు అంతటా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. 

 

ఉమ్మడి పాలమూరులో సగటున 14.53 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరవై మీటర్ల లోతుకు చేరాయని సమాచారం. దీంతో నీటి కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఉదాసీనంగా ఉన్నారు. ఇక ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం పనులూ నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా మంచినీరు అందుతుందని ఎవ్వరూ భావించడంలేదు. వేసవి ముగిసినా నీళ్లు వచ్చే దారి ఉండదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని శివారు ప్రాంతాల్లో అయితే నీటి కొరత ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతవాసులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. పలు మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటిదాకా తాగునీటిని సరఫరా చేసిన బోర్లు ఎండిపోవడంతో జనాలకు దిక్కుతోచడంలేదు. తాగడానికి నీరు ఎక్కణ్ణుంచి తెచ్చుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. ఈ సమస్యలు చాలదన్నట్లు  కొన్నిచోట్ల బోరు మోటార్లు కాలిపోయాయి. బోరుబావుల ఫ్లషింగ్‌, మోటార్లకు మరమ్మతులు చేయకపోవడంతో పలు గ్రామాలు, తండాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే తాగునీటి కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.  

Related Posts