ఏపీలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్యుత్ చార్జీలను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ లోగోను ఆవిష్కరించిన ఆయన..విద్యుత్ రంగం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రజలపై భారం మోపరాదని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. విద్యుత్ సంస్థల ఆర్థిక ఇబ్బందులను కరోనా సంక్షోభం మరింత పెంచిందని, ప్రజల భాగస్వామ్యంతో విద్యుత్ సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారుకరోనా సంక్షోభంతో విద్యుత్ సంస్థలు మరింత ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి చెప్పారు. అయినా సరే ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అందుకే విద్యుత్ పంపిణీ సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదన లేకుండా వార్షిక ఆదాయ అవసర నివేదికలను ఏపీఈఆర్‌సీకి సమర్పించాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కంలను ఆదుకుందని.. 2019–20లో రూ.17,904 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.8,353.58 కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం రూ.717.39 కోట్లు సబ్సిడీ కేటాయించిందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రూ.1,707 కోట్ల సబ్సిడీ ఇచ్చిందని తెలిపారు.