YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఆ ముగ్గురుకు బ్యాడ్ టైం స్టార్టైందా..

ఆ ముగ్గురుకు బ్యాడ్ టైం స్టార్టైందా..

గులాబీ పార్టీలో ఆ ముగ్గురు మూడు మూలస్తంభాల్లో ఒకరు. అయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కారు పార్టీ అధినేత ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత ఓటమి నుంచి అధికారపార్టీకి బ్యాడ్ పిరియడ్ మొదలైపోయింది. ఆ తరువాత దుబ్బాక ఎన్నికలకు గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించి ఎన్నికలు నడిపించారు. కానీ ప్రత్యర్థి బిజెపి చేతిలో సొంతపార్టీ అభ్యర్థి ఓటమి చెందడంతో పరోక్షంగా ఆయన ఓడినట్లే అయ్యింది.

ఇక అత్యంత ప్రతిష్టాత్మకం అయిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేరషన్ ఎన్నికల్లో రాజకీయ ఆల్ రౌండర్ కెసిఆర్ తనయుడు కెటిఆర్ ఎప్పటిలాగే రంగంలోకి దిగారు. సెంచరీ కొట్టి మ్యాచ్ ను విజయం వైపు నడిపిస్తారనుకున్న కెటిఆర్ వ్యూహాలు ఈసారి ఫలించలేదు సరికదా బిజెపి తెలంగాణ గడ్డపై అధికారపార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించేసింది.దుబ్బాక ఓటమి తరువాత నుంచి గులాబీ శ్రేణుల్లో గందరగోళం మొదలైంది.

ఎప్పుడు గెలుపును మాత్రమే ఆస్వాదించే కారు పార్టీ ఓటమి ని కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటుందని లెక్కేసుకోలేదు. ముఖ్యంగా గులాబీ పార్టీకి కాబోయే దళపతి నడిపించే ఎన్నికల్లో ఇలా చతికిల పడతామని అస్సలే అనుకోలేదు. ఈ పరాజయానికి అనేక కారణాలు ఉన్నా ఓటమి ఓటమే కనుక ఇప్పుడు అధికారపార్టీ తన తప్పులను సమీక్షించుకునే పని షురూ చేయక తప్పదు.కుటుంబ పార్టీ గా అంతా పిలిచే గులాబీ కోటకు వరుస బీటలు పార్టీ శ్రేణుల్లో నీరసాన్ని నింపనున్నాయి.

తిరిగి సైన్యాన్ని ఉత్సాహపరిచేందుకు ఇక స్వయంగా కెసిఆర్ సీన్ లోకి దిగడంతో పాటు ఎక్కువ సమయం ప్యాచ్ వర్క్ చేసేందుకు కేటాయించాలిసి ఉంది. అదేవిధంగా తనవాళ్లు అనుకున్న రక్తసంబంధీకులు కూడా పార్టీని ఒడ్డున పాడేయలేకపోవడంపై కేసీఆర్ సమీక్షించుకోవాలి. తమ పార్టీ కుటుంబ పార్టీ కాదని తెలంగాణ వాదుల పార్టీ అన్న నమ్మకం గట్టిగా కలిగిస్తేనే వచ్చే ఎన్నికల నాటికి రణక్షేత్రంలో పోరాడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కొంప ముంచిన సర్వేలు ప్రాంతీయ సెంటిమెంటు ప్రాతిపదికన తెలంగాణలో రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపే రాజకీయంగా ఇన్ని ఒడిదుడుకుల చవిచూస్తుండటంపై తెరాస పార్టీ నేతలు మాత్రమే కాదు పరిశీలకులు కూడా షాక్ తిన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బలపడుతోందని దుబ్బాక ఉప ఎన్నికలోనే వ్యక్తమైనా, పక్షం రోజుల్లోపే ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలు ప్రకటించి ఏం బాపుకుంటున్నట్లు అని తెరాస శ్రేణులు మధనపడుతున్నాయి.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. పరిషత్‌, మునిసిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 16 చోట్ల గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకొని, తొమ్మిది చోట్లనే గెలిచింది. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించినప్పటికీ, ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోయింది. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అరకొర సీట్లు సాధించటం అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌కు రాజకీయ తలవంపుగా మారింది. ఇందుకు దారితీసిన పరిస్థితులపై పలువురు పార్టీ సీనియర్లు ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తమ అధినేత కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితుల్లో అదే పార్టీ నుంచి దుబ్బాక, గ్రేటర్‌లోనూ సవాల్‌ ఎదురుకావటాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

తమపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే బీజేపీకి మేలు చేసిందనే అభిప్రాయాలను టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాక అటు దుబ్బాక, ఇటు గ్రేటర్‌లో అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లిన తమను, మతం ప్రాతిపదికన బీజేపీ విద్వేషాలు రెచ్చగొట్టటం ఇరుకున పెట్టిందని భావిస్తున్నాయి. మజ్లిస్‌తో స్నేహ సంబంధాలు కూడా నష్టం కలిగించాయని అభిప్రాయపడుతున్నాయి. ప్రత్యేకించి గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మతం చుట్టూ బీజేపీ, మజ్లిస్‌ చేసిన విమర్శల ధాటిని టీఆర్‌ఎస్‌ సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని భావిస్తున్నాయి. ముస్లిం మైనార్టీలకు చేరువయ్యామనే ముద్రను చెరిపేసుకొని, హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా ఫలించలేదని అంటున్నాయి. కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు, పోలీసు నిఘా విభాగం ఇచ్చే నివేదికలపైనే పూర్తిగా ఆధారపడి, క్షేత్రస్థాయిలో అసలు ఏమి జరుగుతున్నదో పట్టించుకోకపోవడం పార్టీని దెబ్బ తీసిందని దిగువ స్థాయి తెరాస నేతలు చెబుతున్నారు. ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు వివిధ వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారనే వాదన బలంగా ఉంది.

అయినా వారి సమస్యలను పరిష్కరించటంపై ప్రభుత్వంగా దృష్టి పెట్టకపోవటం నష్టం చేసిందని అంటున్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల మౌలిక వసతులు దెబ్బతినటం, వాటి పునరుద్ధరణ ఆలస్యం కావటం ప్రభుత్వంపై ఉన్న ఫీల్‌గుడ్‌ వాతావరణాన్ని దెబ్బ తీసిందని చెబుతున్నారు. పైగా దుబ్బాక ఓటమి ప్రభావం గ్రేటర్‌ ఎన్నికల్లోనూ పడిందని అంటున్నారు. వీటి నుంచి అధిష్ఠానం, ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పార్టీ నేతలు అంటున్నారు

Related Posts