YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

గాంధీభవన్ వైపు చూడడం లేదే

గాంధీభవన్ వైపు చూడడం లేదే

తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం కూడా పూర్తిగా వదిలేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ రాకపోవడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. ఒకవైపు బీజేపీని చూసుకుంటే అమిత్ షా దగ్గర నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు.కానీ కాంగ్రెస్ లో మాత్రం ఏ ఒక్కరు కనపడలేదు.

పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ మాత్రమే ఇక్కడ కనపడ్డారు. నిజానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన సమయంలో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు ఎందరో ఉన్నారు. గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, చిదంబరం, ఆంటోని వంటి నేతలు ఉన్నారు.

వీరందరూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అండగా నిలిచిన నేతలు.కనీసం వీరిని పంపించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడలేదు. గ్రేటర్ ఎన్నికలు కావడంతో రాహుల్ గాంధీ రావాల్సిన అవసరం లేదనుకున్నా, సీనియర్ నేతలయినా పంపించి ఉంటే కొద్దో గొప్పో పార్టీకి మేలు చేకూరి ఉండేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే సీనియర్ నేతలందరూ ఇటీవల అధిష్టానాన్ని వ్యతిరేకించడంతోనే వారిని పంపలేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం, కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తేలేకపోవడంతో పార్టీ అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.

బీజేపీ నేతలు ఇంత మంది వచ్చి పోతున్నా కనీసం జాతీయ స్థాయి నేత ఎవరూ కన్పించలేదు. కనీసం ఎంపీలు కూడా వచ్చి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించలేదు. అధిష్టానం ఇక్కడి కాంగ్రెస్ నేతలను వారి ఖర్మకు వారికి వదిలేసినట్లు కనపడుతుంది.జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర ప‌రాభవం ఎదురైన సంగ‌తి తెలిసిందే. కేవలం రెండు చోట్ల మాత్ర‌మే ఆ పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. దీంతో.. కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ.. టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ ను నియ‌మించ‌నుంది.

దీంతో చీఫ్ పై ఆశ‌లు పెట్టుకున్న నేత‌లంతా ఇప్పుడు మ‌ళ్లీ ముందుకు వ‌స్తున్నారు. ఆ ప‌ద‌వికి తామే అర్హుల‌మంటున్నారు. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో కాంగ్రెస్ ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబులు ఉన్నారు.  ఇక రేసులో తానే ముందున్నాన‌ని ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్‌ ఇస్తే కాంగ్రెస్‌ శక్తులను ఏకతాటిపైకి తెస్తానన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల తరపున పోరాడుతామని తెలిపారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రజలకు భారంగా మారిందని.. గ్రేట‌ర్ ఫ‌లితాలు చూసైనా ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని సూచించారు. వరదసాయం అందనివారికి మళ్లీ రూ.10వేల సాయం చేయాలని డిమాండ్ చేశారు. వరద సాయం చేయకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని  హెచ్చరించారు.

Related Posts