ఏప్రిల్ 20న చంద్రబాబు 68వ ఏట అడుగిడుతున్నారు. ఇటీవలే 40ఏళ్ల రాజకీయ ప్రస్థానం కూడా పూర్తి చేసుకున్న ఆయన మంచి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు, అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా 20న ఆయన చేపడుతున్న ధర్మపోరాటానికి మద్దతునిస్తున్నారు. ఇదిలాఉంటే విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాసంక్షేమానికే జీవితం అంకితమిచ్చారు చంద్రబాబు. 1978 నుంచి రాజకీయాల్లో కీలకంగా మారిన ఆయన నీతి, నిజాయితీలనే నమ్ముకుని దేశం గర్వించే నేతగా ఎదిగారు.
వ్యక్తి నుంచి వ్యవస్థగా మారిన అరుదైన నాయకుడు చంద్రబాబు. ప్రజా సంక్షేమం కోసం ఆయన తపించి కష్టపడే నైజంతో భారత నాయకగణంలో తనకంటూ ఈ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. విధి నిర్వహణలో తన శక్తికి మించి కష్టపడతారు. శరీరం సహకరిస్తుందా లేదా అనేది చూసుకోరు. అనుకున్న పని సాధించేవరకూ, లక్ష్యం చేరుకునే వరకూ విశ్రమించరు. రాజకీయాల్లో అడుగిడిన నాటి నుంచీ చంద్రబాబుది ఇదే తత్త్వం. అందుకే ఆయన కృషీవలుడిగా నిలిచిపోయారు. ఐకనిక్ లీడర్ గా ఉన్నారు.
తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మంత్రిగానూ బాధ్యతలు స్వీకరించారు. 1983లో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన కృషికి మెచ్చి 1989లో ఎన్టీఆర్ చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలో పోటీకి దించారు. అప్పట్లో భారీ మెజార్టీతో గెలిచిన చంద్రబాబు.. ఇప్పటికీ అదే ఫలితం అందుకుంటున్నారు. నాటి నుంచి కుప్పం స్థానాన్ని కైవసం చేసుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కీలకమైన రెవెన్యూ, ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టారు. అర్థిక విధానం రూపకల్పనలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించేవారని అప్పట్లో ఆయన ఆర్థిక నిపుణులతో ప్రశంసలు అందుకున్నారు. 1995లో.. పార్టీలో అనూహ్య పరిణామాలు సంభవించాయి. కార్యకర్తలను, పార్టీని రక్షించుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరుణంలో చంద్రబాబు పార్టీ శ్రేణుల అభిప్రాయాలను గౌరవించక తప్పలేదు. అలా తెలుగుదేశంలో నాయకత్వ మార్పు జరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్ల ఎనిమిది నెలల పదమూడు రోజులు పదవిలో ఉన్నారు చంద్రబాబు. 2004 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష నేతగా పది సంవత్సరాలు ఉన్నారు. ముఖ్యమంత్రి... ప్రతిపక్షనేత.. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా కొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కూడా ఆయనదే.