YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంజూరు ఘనం.. అమలు స్వల్పం..

మంజూరు ఘనం.. అమలు స్వల్పం..

ఆర్థిక సంవత్సరం చివరి నెలలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మంజూరు చేశారు. దీంతో పలు గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానుండడంతో సర్పంచులు మారే అవకాశం ఉండడంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లలో కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే సర్పంచులు మారినపక్షంలో తమ చెల్లింపులు నిలిచిపోతాయేమోననే వారిని వెన్నాడుతోంది. మొత్తంగా వివిధ కారణాలు పనులను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని పలు గ్రామాలవాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం చివరలో అభివృద్ధి పనులకు సర్కార్ ఆదేశించటం, నేతలు ప్రతిపాదించటం.. అధికారులు అనుమతులివ్వటం వెరసి గ్రామాల్లో అరకొర పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్తున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే పనులు అసంపూర్తిగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామాలు బాగుపడతాయని, బురద దారులు సిమెంటు రహదారులుగా మారతాయని ఆశించిన తమకు నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

 

పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్ల పనులు సాగుతున్నాయి. పనులు మంజూరు సమయంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 90 శాతం, మిగతా 10 శాతం నిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కోటా నిధుల నుంచి కేటాయిస్తూ ఈ కార్యక్రమాలను ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చి 31వ తేదీలోగా సిమెంటు రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన బిల్లులు రికార్డు చేసి ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో సమర్పించాలని నిబంధన. అయితే గడచిన మార్చి 31 తర్వాత పనులు చేస్తే బిల్లులు మంజూరు చేయటం సాధ్యం కాదని కొందరు చెప్పారు. వాస్తవానికి అభివృద్ధి పనులుకు సంబంధించి..సర్పంచి పేరుతో డబ్బు సర్పంచి బ్యాంక్‌  ఖాతాకు జమవుతుంది. సర్పంచి డబ్బు డ్రా చేసి పనులు నిర్వహించిన వారికి ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు వచ్చే జులై 31వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుంది. ఈలోపుగా చేపట్టిన పనులకు బిల్లులు వస్తాయో రావో తెలియక కొంత సందిగ్ధత నెలకొంది. గతేడాది చేసిన పనులకు సంబంధించి నేటివరకు దాదాపు రూ.4 కోట్లు చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సకాలంలో పనులు చేసినా, పదవీ కాలం ముగిసే భయంతో సర్పంచులు ఎవరూ పనులు చేసేందుకు అనాసక్తి చూపారు. అయినప్పటికీ నేతల చొరవతో రహదారుల పనులు ప్రారంభించారు. వీటికి సంబంధించిన బిల్లులు జాప్యమవుతుండడంతో కాంట్రాక్టర్లూ నెమ్మదిగా పనులు సాగిస్తున్నారు. ఈ అంశంపైనే సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని, రోడ్లు పూర్తిచేయాలని కోరుతున్నారు.

Related Posts