గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి సుదీర్ఘ విరామ తర్వాత విజయం సాధించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు సెగ తగులుతోందని అంటున్నారు పార్టీ నేతలు. నరసారావుపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఇటీవల కొన్నాళ్లుగా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యరపతినేని శ్రీనివాసరావు ఈ అక్రమాలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఇది వివాదంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా వెంటనే స్పందించే అంబటి.. తనపై వస్తున్న విమర్శలకు మాత్రం ఎక్కడా స్పందించక పోవడం గమనార్హం.నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఇటీవల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో చాలా మంది టీడీపీ నేతలు ఆయనను కలిసి పూర్వ పరిచయంతో మాట్లాడుతూ.. అంబటి అక్రమాలు చేస్తున్నారని.. మైనింగ్ ను దోచుకుంటు న్నారని ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. స్థానిక మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఆయనకు చూపించారు. దీంతో నేరుగా లావు.. అంబటికి ఫోన్ చేసి.. వివరణ కోరినట్టు తెలుస్తోంది. అయితే.. నువ్వు చిన్నపిల్లాడివి.. ఈ విషయాలు నీకు తెలియవు.. అని అంబటి ఫోన్ కట్ చేయడంతో హర్ట్ అయిన.. లావు.. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇదే విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. సజ్జల రామకృష్ణారెడ్డికి నేరుగా ఎంపీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, అంబటిపై స్థానికంగా కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన పెద్దగా ఉండడం లేదని.. గుంటూరుకే పరిమితమవుతున్నారని.. కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని.. తమ సమస్యలను పరిష్కరించే సమయం కూడా ఆయన కేటాయించడం లేదని వారు పేర్కొంటుండడం గమనార్హం.మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే.. అంబటి దూకుడు లేకపోగా.. విమర్శల సుడిగుండాల్లో చిక్కుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇలా అయితే.. ఆయన ఆశ పెట్టుకున్న మంత్రి పదవి కూడా దక్కే అవకాశం లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.