తాజాగా వైసీపీ వర్గాల్లో ముఖ్యంగా సీఎంవో వర్గాల్లో ఆసక్తికర విషయం చర్చకు వచ్చింది. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి మద్దతు దారుగా మారిన కరణం బలరాం దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. అదే సమయంలో తనకు అనుకూలంగా ఉన్న అధికారులను నియోజకవర్గంలో నియమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ కి చెక్ పెట్టేలా.. కరణం వ్యూహాత్మకంగా కొందరు అధికారులను ఇక్కడ నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇక్కడ పనిచేసిన అధికారులను కరణం తిరిగి నియమించుకోవడం ఆమంచి కృష్ణమోహన్ తో పాటు పాత వైసీపీ నేతలకు, జగన్ వీరాభిమానులకు అస్సలు నచ్చడం లేదు.ఇక ఇటీవల కరణం వర్గం పదే పదే ఆమంచి కృష్ణమోహన్ ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. కరణం కావొచ్చు.. ఆయన తనయుడు వెంకటేష్ కావొచ్చు పదే పదే చీరాల ప్రజలకు తమతోనే శాంతి వస్తుందని… ఆమంచిని టార్గెట్ చేసేలా మాట్లాడుతున్నారు. ఈ మాటలే వర్గాల మధ్య మరింత కాకరేపుతున్నాయి. ఈ పరిణామాలు అన్ని ఆమంచి కృష్ణమోహన్, కరణం మధ్య తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇరు వర్గాలు పరస్పరం దూషించుకోవడం.. సవాళ్లు రువ్వుకుంటున్నాయి. దీంతో చీరాల రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.అయితే.. కరణం.. వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ విషయంలో పైకి వేరే వేరే కారణాలు చెబుతున్నా అధికారుల బదిలీలు.. అభివృద్ధి పనుల నిధుల మంజూరు, ఇతరత్రా అనుమతుల విషయంలో తలెత్తిన వివాదాలే తీవ్ర వివాదానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఓడిపోయినా.. తనకు వ్యతిరేకంగా అప్పటి వరకు ఉన్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు ఆమంచి కృష్ణమోహన్. దీంతో చీరాలలో ఆమంచి రాజకీయాలకు తిరుగులేకుండా నడిచింది. కరణం ఎంట్రీతో చీరాలలో తిరిగి గతంలో ఉన్న అధికారులనే నియమించేలా ఒత్తిడి ప్రారంభమైంది. ఇది చిలికి చిలికి నియోజకవర్గంలో దాడులు,.. ప్రతిదాడులు.. సవాళ్ల వరకు కూడా సాగదీసింది.ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాంల మధ్య పంచాయితీ చేయలేం అని చేతులు ఎత్తేశారు. ఈ విషయం ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ వద్ద నేరుగా ప్రస్తావించారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు.. డీఎస్పీ, చీరాల తహసీల్దార్, జాయింట్ కలెక్టర్ వంటి విషయాలపై కరణం వెంకటేష్ పంపించిన నివేదికను నేరుగా బాలినేని ఇటీవల కేబినెట్ భేటీ అనంతరం జగన్‌కు సమర్పించినట్టు తెలిసింది. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని జగన్ పక్కన పెట్టాలని ఆదేశించడంతో బాలినేని ఈ విషయాన్ని పక్కన పెట్టారని అంటున్నారు.ఈ పరిణామం ఆమంచి కృష్ణమోహన్ వర్గంలో ఖుషీ నింపింది. స్థానికంగా జరుగుతున్న పరిణామాలను జగన్ గమనిస్తున్నారని.. ఆయనకు విషయం అర్ధమై తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి జగన్ మదిలో ఏముందో కానీ ఇప్పటికైతే ఆమంచికి సానుకూల పరిణామమే ఏర్పడింది. అయితే స్థానికంగా మాత్రం జిల్లా మంత్రి బాలినేని పరోక్షంగా బలరాంకు సపోర్ట్ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చీరాలలో ప్రశాంత రాజకీయాన్ని ప్రజలు ఎప్పటికి చూస్తారో ..?