టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎప్పటికప్పుడు తనను తాను కొలుచుకుంటూ.. తన పార్టీని కూడా కొలుస్తూ ఉంటారు. ప్రజల్లో తన పార్టీ విషయంలో ఎలాంటి సానుకూలత ఉంది ? ప‌్రజలు ఏమను కుంటున్నారు ? అనే విషయాలను ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగానే కాకుండా… స్థానికంగా జరుగుతున్న పరిణామాలను కూడా అంచనా వేసుకుని చంద్రబాబు తన గ్రాఫ్‌ను తనే నిర్ణయించుకుంటారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీలను నియమించిన ఆయన.. ఇదే విషయాన్ని కూడా ఆరా తీశారు. పార్టీ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకున్నారు.మూడు కీలక విషయాలు.. ప్రజల్లో బలంగా పనిచేస్తున్నాయని చంద్రబాబుకు తెలిసింది. ఒకటి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. రాజధాని అమరావతి పూర్తయ్యేదని.. ప్రజలు ఎక్కువగా అనుకుంటున్నట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గం సహా.. మూడు నాలుగు జిల్లాలలో ఇదే విషయం హాట్ టాపిక్‌గా ఉందని చంద్రబాబు గుర్తించారట. అదే సమయంలో పోలవరం విషయంలోనూ బాబుకు మంచి మార్కులు పడుతున్నాయని తెలిసిందట. ఎంత కాదన్నా.. చంద్రబాబు ఉండి ఉంటే.. పోలవరం ఈ పాటికి చాలా వరకు పూర్తయ్యేదని రైతులు కూడా అంటున్నారని చంద్రబాబుకు నివేదికలు అందాయట. జగన్ వైఖరి కారణంగా నాలుగు జిల్లాలకు పోలవరం నీరు అందకుండా పోతోందనే ఆవేదన రైతుల నుంచి వ్యక్తమైందట.ఇక, మరో ముఖ్య విషయం.. బీజేపీతో ఫైట్ చేసి.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే అంశం. ప్రస్తుతం .. జగన్‌కు 22 మంది ఎంపీలు ఉన్నా.. ఏమీ సాధించలేక పోతున్నారని.. ప్రతి విషయంలోనూ కేంద్రానికి సాగిలపడుతున్నట్టు కనిపిస్తోందని ఎక్కువగా ప్రజలు అభిప్రాయపడుతున్న విషయాన్ని చంద్రబాబు తన పార్టీ నేతలకు చెప్పారట. అంతేకాదు.. తను ఉండి ఉంటే.. కేంద్రంతో పోరాడైనా.. సాధించేవారని.. అదే సమయంలో జగన్ తనపై ఉన్న కేసుల విషయంలో రాజీ పడుతున్నారని కొందరు చెప్పుకొచ్చినట్టు చంద్రబాబు తెలిపారు. మొత్తానికి ఈ విషయంలో తమ పాచిక పారిందని.. జగన్ తనపై ఉన్న కేసుల కోసమే కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తాము ప్రచారం చేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పరిణామాలతో టీడీపీ గ్రాఫ్ పెరుగుతోందని .. ఎవరూ నిరుత్సాహం వ్యక్తీకరించాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు ఆయన హితవు పలికారట.