YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

చిరాగ్...కిం కర్తవ్యం..

 చిరాగ్...కిం కర్తవ్యం..

కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరివాడయినట్లే కన్పిస్తున్నాడు. ఆయన వేసిన తప్పుటడుగులే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. బీహార్ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. నితీష్ కుమార్ మీద ఆగ్రహంతో ఆయన ఎన్డీఏను వీడారు. తన లోక్ జనశక్తి పార్టీ విడిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. అదే సమయంలో బీజేపీకి మద్దతుగానే నిలిచారు.బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆయన తిరిగి ఎన్డీఏలో చేరాలనుకుంటున్నా ఇప్పటి వరకూ బీజేపీ ఆ ప్రతిపాదన ఏవీ తీసుకురాలేదు. నితీష్ కుమార్ చిరాగ్ తిరిగి ప్రవేశానికి అడ్డుపడుతున్నారు. దీనికి తోడు తన తండ్రి మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తన కుటుంబానికే ఇస్తారని చిరాగ్ పాశ్వాన్ భావించారు. కానీ తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా సుశీల్ కుమార్ మోదీని ప్రకటించడంతో చిరాగ్ హర్ట్ అయ్యారు.రాష్ట్రీయ జనతాదళ్ అధినేత తేజస్వి యాదవ్ చిరాగ్ పాశ్వాన్ ను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరాగ్ పాశ్వాన్ తో ఇప్పటికిప్పుడు వచ్చే లాభం లేకున్నా భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చిరాగ్ ను తమ కూటమిలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఆఫర్ కూడా తేజస్వి యాదవ్ ప్రకటించారు. కానీ చిరాగ్ పాశ్వాన్ దీనిపై సన్నిహితులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది.బీహార్ ఎన్నికలు మొన్ననే జరిగాయి. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న పార్టీ నుంచి పక్కకు తప్పుకుని ప్రతిపక్షంలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నారు. రాజ్యసభ కాకున్నా ఇతర ప్రయోజనాలను పొందేందుకు బీజేపీ తోనే కలసి నడవటమే మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. చిరాగ్ కు కూడా ఆయన సన్నిహితులు బీజేపీతోనే ఉండాలని సూచిస్తుండటంతో కొంత ఆలోచనలో పడ్డారు. మొత్తం మీద చిరాగ్ పాశ్వాన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమయినా ఇప్పుడు బీహార్ లో హాట్ టాపిక్ గా మారారు.

Related Posts