YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సోలిన సోలార్ స్కీమ్!

సోలిన సోలార్ స్కీమ్!

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో సురక్షిత తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం సౌరశక్తి ద్వారా పనిచేసే నీటి ప్రాజెక్టులు ప్రారంభించింది. తండాల్లోని ప్రజలకు అన్ని సమయాల్లోనూ మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఈ ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరని పరిస్థితులు ఉంటున్నాయని ఏజెన్సీవాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దాదాపు రూ.3.85కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని.. ఫలితంగా సమర్ధవంతంగా తాగునీరు అందించలేకపోతున్నాయని చెప్తున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 77 సోలార్ పవర్ ఆధారిత ప్రాజెక్టులను మంజూరు చేయగా 33 పథకాలను ఏర్పాటుచేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ సౌర విద్యుత్తు ఆధారిత పథకాలు పని చేస్తున్నాయా.. లేదా అని ఇప్పటివరకు ఆ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయలేదని స్థానికులు అంటున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేదని కొన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన ఈ పథకాలు మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

 

వేసవిలోనే కాక మామూలు రోజుల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఫిబ్రవరి చివరి వారం నుంచి అయితే వీరి కష్టాలు తారస్థాయికి చేరతాయి. గుక్కెడు నీటి కోసం జనాలు అలమటించిపోవాల్సిన దుస్థితి ఉంటుంది. మంచినీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కిలోమీటర్ల మేర నడిస్తేనే గానీ ప్రజలకు నీరు దక్కని పరిస్థితులు ఉంటున్నాయి. అష్టకష్టాలు పడి తెచ్చుకుంటున్న నీరు రక్షితమైనదేనా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. ఏమాత్రం సురక్షితం కాని నీటినే సేవిస్తూ వేసవిలో పలువురు దాహార్తి తీర్చుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం గట్టిగానే కృషిస్తోంది. ప్రజలకు మంచి నీరు అందించేందుకు నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. అయితే అధికార యంత్రాంగ పరిధిలోని ఉదాసీనత ప్రాజెక్టుల పనితీరును ప్రభావితం చేస్తోంది. ప్రాజెక్టులు సరిగా పనిచేస్తున్నాయా..లేదా.. అనే విషయాలను సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలేదు. దీంతో రూ.లక్షలతో నిర్మించిన నీటి పథకాలు లక్ష్యానికి తగ్గట్లుగా సేవలు అందించలేకపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొరాయించిన నీటి ప్రాజెక్టులను బాగు చేయించాలని ఆదిలాబాద్ వాసులు కోరుతున్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు

Related Posts