కరోనాబారిన పడిన వాళ్లలో చాలా మంది కోలుకుంటున్నారు. ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ.. మన దగ్గర రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. కానీ కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ.. చాలా మందిలో అనారోగ్య సమస్యలు మాత్రం తగ్గడం లేదు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతోంది. మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోతున్నామని చాలా మంది చెబుతున్నారు.అంతే కాదు కోవిడ్ నుంచి కోలుకున్న పురుషులకు మరో సమస్య కూడా తలెత్తుతోంది. కరోనాను జయించిన కొందరు పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోయినట్లు యూరోపియన్ సొసైటీ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్‌కు చెందిన ఇటాలియన్ పరిశోధకులు గుర్తించారు.వారు లైంగికంగా అసౌకర్యంగా ఉండటం, పునరోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న పురుషులు అంగస్తంభన సమస్యలను ఎదుర్కొనే ముప్పు ఉందని అమెరికాకు చెందిన నిపుణుడు డాక్టర్ డెనా గ్రేసన్ హెచ్చరించారు.‘కరోనా వైరస్ రక్తనాళ వ్యవస్థలో సమస్యలను కలగజేస్తుంది. ఫలితంగా పురుషుల్లో దీర్ఘకాలికంగా అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ వైరస్ చంపకపోవచ్చు కానీ దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. జీవితాంతం లైంగిక సామర్థ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని అమెరికాలోని మీడియా సంస్థలకు డాక్టర్ డెనా గ్రేసన్ తెలిపారు.పురుషులు మోస్తరుగా కరోనా ప్రభావానికి గురైనా దీర్ఘకాలంపాటు అంగస్తంభన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్ గ్రేసన్ తెలిపారు. కాబట్టి కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ఆమె సూచించారు.కరోనా బారిన పడిన కొందరిలో అంగస్తంభన అనూహ్యంగా తగ్గిపోతుంది.. శృంగార ఆస్వాదన చాలా తక్కువగా ఉంటోందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ (ఈఎస్ఎస్ఎం) రిపోర్టు పేర్కొంది. ఇటలీలోని ఫెడ్రికో 2 యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీనిపై పరిశోధనలు జరిపారు.