గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకోవడానికి టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అదేలా ఉండబోతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఎక్స్ అఫిషియో సభ్యుల బలం కలిసినా టీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా? లేదా మరేదైనా వ్యూహంతో ముందుకెళ్లబోతుందా?అనే ఆసక్తి నెలకొంది.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను టీఆర్ఎస్‌నే గెల్చుకుంది. దాంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు గులాబీకే దక్కాయి. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లతోపాటు 45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు.కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో ఎక్స్‌అఫిషియో సభ్యుల నమోదుకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో ఓటు వేయకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నమోదు చేసుకుంటే మాత్రం వారు కూడా ఓటు వేయొచ్చు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే 98 ఓట్లు అవసరం ఉంది. అదే గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు కలిపి టీఆర్ఎస్‌కు మొత్తంగా 87 మందివరకు ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇక్కడే ఓటు వేసినా మరో ఏడెనిమిది ఓట్లు అవసరం పడుతుంది. మరి.. జీహెచ్‌ఎంసీలో 44 స్థానాలు వచ్చిన మజ్లిస్ పార్టీ మద్దతు తెలిపితే టీఆర్ఎస్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యుల అవసరం ఉండదనే చెప్పాలి.మేయర్ ఎన్నిక రోజున మెజారిటీ ఉన్న పార్టీ అభ్యర్థిని మేయర్‌గా ఎన్నుకుంటారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అలాగే జరుగుతుంది. టీఆర్ఎస్‌కు మజ్లిస్ నేరుగా మద్దతు ఇవ్వకుండా ఓటింగుకు గైర్హాజరయితే మాత్రం టీఆర్ఎస్‌కు మేయర్ పదవికి ఇబ్బంది ఉండదు.ఇప్పుడు ఈ అంశంపైనా జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి 10 వరకు గడువు ఉండగా.. కొత్త మేయర్ ఎంపికపై ఆ లోపు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈలోగా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి