YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అనధికార కోతలతో ఉక్కిరిబిక్కిరి

అనధికార కోతలతో ఉక్కిరిబిక్కిరి

కరీంనగర్ లో వివిధ అబివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక కార్పొరేషన్‌ పరిధిలో అయితే బృహత్‌ ప్రణాళికను అమలు చేస్తున్నారు అధికారులు. ఈ ప్లాన్ లో భాగంగా స్థానికంగా రోడ్లు విస్తరిస్తున్నారు. విద్యుత్ రంగానికి సంబంధించిన పనులూ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ పనులు ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే ఎండలు ముదిరిపోతున్నాయి. ఉదయం 9 దాటితే ఇళ్లల్లోంచి బయటకు రాలేనంత ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు గృహాల్లోనే ఉంటున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వద్ద సేదతీరుతున్నారు. విద్యుత్ పనులు కొనసాగుతుండడంతో కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల నేపథ్యంలో తరచూ కరెంట్ కోత ఉంటోంది. ఆ సమయంలో జనాలు ఇళ్లల్లో ఉండలేక, బయటకు రాలేక సతమతమవుతున్నారు. స్థానికంగా రహదారి విస్తరణకు తోడు పెద్ద ఇనుప స్తంభాల్ని ఏర్పాటు సహా తీగలు అమర్చుతున్నారు. ఈ పనులకు దాదాపు రూ.18కోట్లు వెచ్చిస్తున్నారు. 

 

కార్పోరేషన్ పరిధిలోనే ఐపీడీఎస్‌ పథకంలో భాగంగా రూ.11కోట్లతో విద్యుత్తు వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. వేసవికాల వాతావరణం పొడిగా ఉంటుందని కనుక ఇప్పుడే పనులను త్వరితగతిన పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో  అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు సహా కొత్తగా ఎత్తైన విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనుల కోసం గంటల తరబడి విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో జనాలకు పాట్లు తప్పడంలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారిక కోతల్ని పెడుతుండటం వల్ల స్థానికులు నానాఅవస్థలు పడుతున్నారు. ఒకే సారి రెండు రకాల పనులు జరుగుతుండటం వేర్వేరు ప్రాంతాల్లోని ఏడెనిమిది కాలనీలకు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడివారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాతావరణం వేడెక్కిపోవడం, ఉక్కపోత అధికంగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఏదేమైనా ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తైపోవాలని అంతా ఆశిస్తున్నారు. 

Related Posts